ఇదేమి తీరు?

25 May, 2016 03:37 IST|Sakshi

గిరిజనులకు పరిహారం చెల్లింపుపై జాతీయ ఎస్టీ కమిషన్ అసంతృప్తి
వివిధ అంశాలపై ఏపీ అధికారులిచ్చిన వివరణ పట్ల సందేహాలు

 సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాల్లో గిరిజనులకు పరిహారం చెల్లిస్తున్న తీరు, పునరావాసం కల్పిస్తున్న తీరు పట్ల జాతీయ ఎస్టీ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి పరిస్థితిని అంచనా వేయాలని కమిషన్ నిర్ణయించిన ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో కమిషన్ చైర్మన్ డాక్టర్ రామేశ్వర్ ఒరాఒన్ మంగళవారం ఇక్కడి ఎస్టీ కమిషన్ కార్యాలయంలో విచారణ జరిపారు.

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని దేవరగొద్ది, తూర్పుగోదావరి జిల్లాలోని పూడిపల్లి పంచాయతీ పరిధిలో గిరిజనులు నిర్వాసితులైన తీరు, వారికి చెల్లిస్తున్న పరిహారం, కల్పిస్తున్న పునరావాసం తదితర అంశాలపై ఈ విచారణ కొనసాగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పోలవరం నిర్వాసితులకిస్తున్న పరిహారంపై అడిగిన ప్రశ్నలకు ఏపీ అధికారులిచ్చిన వివరణ పట్ల కమిషన్ చైర్మన్ సంతృప్తి చెందలేదు. 2013 నాటి భూసేకరణ చట్టం వర్తింపజేయకపోవడం తదితర విషయాల్లో ఏపీ అధికారులిచ్చిన వివరణకు చైర్మన్ సంతృప్తి చెందనట్టు సమాచారం.

 ఆ సమాధానాలు సంతృప్తినివ్వలేదు
సమావేశానంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు వల్ల లక్షా 91 వేలమంది నిర్వాసితులవుతుండగా అందులో లక్షా 7 వేలమంది గిరిజనులని, వారికి సరైన పునరావాసం కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈ విషయమై ఏపీ అధికారుల నుంచి సరైన వివరణ లభించలేదన్నారు. అందుకే కమిషన్ స్వయంగా పోలవరం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. పాత చట్టాల ప్రకారం ఇస్తున్న పరిహారం సముచితంగా ఉందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించి తదనంతరం తగిన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. పోలవరం వల్ల ఒడిశాలో అరుదైన ఆదిమ జాతి, ఛత్తీస్‌గఢ్‌లో రెండు అరుదైన ఆదిమ జాతులు అంతరించిపోతాయని, ఇది చాలా తీవ్రమైన అంశమని చైర్మన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు