బీజేపీయే మహా అడ్డు

23 Apr, 2018 07:19 IST|Sakshi
ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌

రాష్ట్రంలో మహా నది నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వం

జలాల పంపిణీ వివాదంపై ప్రజలకు వివరించాలి

పార్టీ శ్రేణులకు సీఎం నవీన్‌ పట్నాయక్‌ పిలుపు

భువనేశ్వర్‌ : రాష్ట్రంలో మహా నది నీటి ప్రవాహాన్ని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆరోపించారు. మహా నది జలాల పంపిణీ వివాదంపై బిజూ జనతా దళ్‌(బీజేడీ) రాష్ట్ర శాఖ కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక వర్కు షాపు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో తీవ్ర కలకలం రేకెత్తిస్తున్న మహా నది జలాల వివాదంపై పార్టీ శ్రేణుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో మహా నది జలాలు అడుగంటి పోతున్నాయన్నారు.

ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాలిత ప్రభుత్వం మహా నది ఎగువ భాగంలో అక్రమ కట్టడాలు చేపట్టి రాష్ట్రంలో లోతట్టు ప్రాంతాలకు మహా నది జలాల ప్రవాహాన్ని అడ్డుకుంటుందని బాహాటంగా ఆరోపించారు. ఈ వివాదం పరిష్కారానికి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థించిన పెడ చెవిన పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు గుర్తు చేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గరకు వెళ్లి మహా నది జలాల పంపిణీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మహా నది ఇరు వైపులా విశేష సంఖ్యలో మొక్కలు నాటి హరిత పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హరిత మహా నది కార్యక్రమాన్ని చేపట్టినట్టు ప్రకటించారు.

ప్రాంతీయ పార్టీగా కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టే అవకాశం లేనందున రాష్ట్ర పురోగతి కుంటుపడుతుందని పార్టీ ఎంపీలు విచారం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలంతా సమైక్యంగా కృషి చేసి రానున్న ఎన్నికల్లో మహా నది ప్రధాన శీర్షికగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహా నది తీర ప్రాంతాల్లో 15 ప్రభావిత జిల్లాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో మహా సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ 15 జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, ఇతరేతర అనుబంధ వర్గాలు మహా సమ్మేళనంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మహా నదిపై చైతన్య సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.    

మరిన్ని వార్తలు