‘నవీ’కి త్వరలో టెండర్లు

22 Dec, 2013 23:35 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రతిపాదిత నవీముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. త్వరలో ఈ విమానాశ్రయం పనుల కోసం టెండర్లను ఆహ్వానించేందుకు సిటీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ నుంచి అవసరమైన అనుమతి లభించడంతో ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ముంబైలో డొమెస్టిక్ (శాంతాక్రజ్), అంతర్జాతీయ (సహార్) విమానాశ్రాయాలున్నాయి. ఇందులో సహర్ విమానాశ్రయంపై విమానాల రాకపోకల భారం విపరీతంగా పెరిగింది. దీంతో నగరంలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నవీముం బైలోని పన్వేల్ సమీపంలో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ప్రత్యక్షంగా అమలులోకి తెచ్చేందుకు సిడ్కో ద్వారా అనేక ప్రయత్నాలు చేసింది. స్థల సేకరణ, ఇతర సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో ఈ విమానాశ్రయం పనులు అనుకున్నట్టుగా ముందుకు సాగలేదు. అయితే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రత్యేక చొరవ తీసుకుని గత నెలలో ఇక్కడి నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. అయినా కొన్ని గ్రామాలవాసులు ఈ ప్యాకేజీలను స్వీకరించేందుకు నిరాకరించాయి.
 
 దీంతో ప్రభుత్వం ఖాడీ, ఉప్పు భూముల్లోనే విమానాశ్రయాన్ని నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ విమానాశ్రయం నిర్మాణం కోసం కేంద్ర విమానయాన శాఖ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు అనుమతివ్వాలని కోరుతూ సిడ్కో గత నెలలో ఈ కమిటీకి సిపా ర్సు చేసింది. దీనికి సానుకూల స్పందన రావడంతో టెండర్ల ప్రక్రియ ఊపందుకుంది. కాగా, టెండర్లను ఆహ్వానించే ముందు టెండరు వేసేం దుకు ఆసక్తి కనబరుస్తున్న కంపెనీలు అర్హతను పరిశీలించనున్నారు. దీనికి ముందుగా ఈ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. చర్చల అనంతరం ఎన్ని కంపెనీలు అర్హతసాధిస్తాయనేది స్పష్టం కానుంది. ఏటా 10 లక్షల మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.   
 

మరిన్ని వార్తలు