అస్తవ్యస్తం, గందరగోళం

6 Mar, 2014 23:07 IST|Sakshi

ముంబై: శివసేన, బీజేపీ, ఆర్‌పీఐ నేతృత్వంలోని మహాకూటమి అస్తవ్యస్తంగా మారిందని, అందులో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఎన్సీపీ విమర్శించింది. సిద్ధాంతాలు ఒక్కటికాకపోయినా కేవలం అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతోనే ఇవన్నీ ఏకమయ్యాయని ఆ పార్టీ నాయకుడు నవాబ్ మలిక్ విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘గడ్కరీ, ముండే శిబిరాల మధ్య అంతర్గత కలహాలు పతాకస్థాయికి చేరుకున్నాయన్నాయి.

శివసేన, బీజేపీలు కూడా పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ఎన్డీయేలోకి శరద్‌పవార్ రాకుండా అడ్డుకున్నానని ముండే చెబుతారు. అయితే బీజేపీ తీరుతో విసిగిపోయినపుడు ఆయన 10 జనపథ్ (సోనియాగాంధీ నివాసం)కు వెళ్లారు. అయితే ముండే సన్నిహితులు కొందరు ఆయనను కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు’ అని అన్నారు. బీజేపీ వాస్తవానికి వ్యాపారుల పార్టీ అని ఆయన అభివర్ణించారు. సైనికులకంటే వ్యాపారులే మరిన్ని సాహసాలు చేస్తారని వ్యాఖ్యానించడంద్వారా మోడీ...సైనికులను అవమానించారన్నారు. బీజేపీ వ్యాపారుల పార్టీ అని శివసేన భావిస్తే ఆ   పార్టీతో ఇంకా పొత్తు ఎందుకంటూ ఉద్ధవ్‌ని నిలదీశారు.

>
మరిన్ని వార్తలు