పోరుకు సిద్ధమవుతున్న ఎన్సీపీ

25 Oct, 2013 23:41 IST|Sakshi

 న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోతోపాటు అభ్యర్థుల తొలి జాబితానూ దీపావళి తరువాత విడుదల చేస్తామని జాతీయవాది కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రకటించింది. పండుగకు ముందే మేనిఫెస్టోను విడుదల చేయాలని అనుకున్నా.. మరింత సమయం అవసరమైనందున వచ్చే నెలలో ప్రకటించాలని భావిస్తున్నామని ఢిల్లీ ఎన్సీపీ అధ్యక్షుడు కన్వర్ ప్రతాప్ సింగ్ శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ‘మొత్తం 70 స్థానాల్లో మేం అభ్యర్థులను నిలబెడతాం. ఒక్కో స్థానంలో పోటీకి దాదాపు ఐదు దరఖాస్తులు వచ్చాయి. సచ్ఛరిత్ర కలిగి ఉండడంతోపాటు అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యుడైన వారికే టికెట్లు ఇవ్వాలని పార్టీ అధిపతి శరద్ పవార్, ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్ ఆదేశించారు. పోయినసారి కేవలం 15 స్థానాల్లోనే పోటీ చేసినా ఈసారి జాతీయ పార్టీ మాదిరిగానే అన్ని చోట్లా పోటీకి దిగాలని నిర్ణయించుకున్నాం’ అని సింగ్ వివరించారు. తమ పార్టీ ఎన్నికల ప్రచారానికి వ్యాపార, మేధోవర్గాల నుంచి అద్భుత స్పందన వస్తోందని ప్రకటించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు విపిన్‌కుమార్ గోయల్, అమర్‌సింగ్ పార్టీ రాష్ట్రీయ లోక్‌మంచ్ ఢిల్లీశాఖ ప్రధాన కార్యదర్శి భగవతి ప్రసాద్‌నిషాద్ వంటి ప్రముఖులు ఎన్సీపీలో చేరారని తెలిపారు. ఢిల్లీ ఎన్సీపీ ఉపాధ్యక్షుడిగా గోయల్‌ను నియమించామని వెల్లడించారు.
 
  ‘ఎన్సీపీ జెండాపై గెలిచి ఇతర పార్టీల్లోకి ఫిరాయించడాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిజానికి అన్ని పార్టీల్లోనూ ఈ సమస్య ఉంది’ అని తెలిపారు. షీలా దీక్షిత్ ప్రభుత్వం వ్యాపారులతో కుమ్మక్కు కావడం వల్లే ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలను తీసుకువస్తున్నప్పటికీ రవాణాభారం కిలోకు రూ.25కు మించ దు కాబట్టి కిలో ధర రూ.70 వరకు ఉండాలన్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీవ్యాప్తంగా రూ.100 కు కిలో ఉల్లిపాయలు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఉల్లి ధరలు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్ ముందుగానే హెచ్చరించినా షీలా దీక్షిత్ ప్రభుత్వం పట్టించుకోలేదని కన్వర్‌ప్రతాప్ సింగ్ విమర్శించారు.

మరిన్ని వార్తలు