22 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం

19 Jan, 2014 23:40 IST|Sakshi

నాగపూర్: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 22 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని ఎన్సీపీ అగ్ర నాయకుడు, కేంద్ర భారీపరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ పునరుద్ఘాటించారు. శనివారం సాయంత్రం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. అభ్యర్థుల జాబితా ఇప్పటికే ఖరారైందన్నారు. 22కు తక్కువగానీ లేదా ఒకటి ఎక్కువగానీ స్థానాలనుంచి పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు. సన్నద్ధత వ్యక్తం చేసిన తమ పార్టీకి చెందిన రాష్ర్టమంత్రులను సైతం ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించుతామన్నారు.

 కాగా లోక్‌సభ స్థానాల పంపిణీ విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య వివాదం నడుస్తున్న సంగతి విదితమే. ఎన్సీపీ కోటాను 22 నుంచి 19కి తగ్గించాలని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే ఇటీవల పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 48 స్థానాలు ఉండగా 29 నియోజకవర్గాలనుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య వివాదం నానాటికీ ముదురుతోంది.
 ఆప్ వల్ల ఇబ్బందేమీ లేదు
 ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)వల్ల తమకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని ప్రఫుల్ పేర్కొన్నారు. రాష్ట్రం లో ఆ పార్టీ ప్రభావం అంతంతమాత్రమేనన్నారు.

మరిన్ని వార్తలు