-

ఢిల్లీ ‘చుట్టూ’ కేంద్ర మంత్రులు

11 Nov, 2014 00:08 IST|Sakshi
ఢిల్లీ ‘చుట్టూ’ కేంద్ర మంత్రులు

* ఎన్సీఆర్‌లోని అన్ని ప్రాంతాలకు  కేబినెట్లో ప్రాతినిధ్యం
* ప్రాజెక్టులు వేగవంతమయ్యే అవకాశం
* ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి

సాక్షి, న్యూఢిల్లీ: మన్మోహన్‌సింగ్ కేబినెట్‌తో పోలీస్తే నరేంద్ర మోదీ కేబినెట్‌లో ఢిల్లీకి ప్రాతినిధ్యం తగ్గినప్పటికీ జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత లభించింది. తాజా కేబినెట్ విస్తరణలో మహేశ్ శర్మకు మంత్రిపదవి లభించడంతో ఢిల్లీ- ఎన్సీఆర్ నుంచి ఐదుగురికి మంత్రిపదవులు దక్కాయి. దీనితో ఢిల్లీ- ఎన్సీఆర్‌లో పెండింగులో ఉన్న అనేక ప్రాజెక్టుల అమలులో వేగం వస్తుందన్న ఆశలు మొదలయ్యాయి.
 
ఢిల్లీకి చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన ఐదుగురు మంత్రులలో ఒకరు కేబినెట్ మంత్రి హర్షవర్ధన్ కాగా మిగతా మిగతావారు వీకే సింగ్, రావ్ ఇందర్‌జీత్‌సింగ్, మహేశ్ శర్మ, కృష్ణపాల్ సహాయ మంత్రులుగా ఉన్నారు. వీరిలో జనరల్ వీకే సింగ్ ఘజియాబాద్‌కు, రావ్ ఇందర్‌జీత్ సింగ్ గుర్గావ్‌కు, మహేశ్ శర్మ నోయిడాకు, కృష్ణపాల్ ఫరీదాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఐదుగురు మంత్రుల సమన్వయంతో ఢిల్లీ ఎన్సీఆర్‌ల మధ్య రోడ్డు, రవాణా, నీటిసరఫరా, విద్యుత్తు రంగాలలో ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న ప్రాజెక్టులు వేగం పుం జుకుంటాయని ఆశిస్తున్నారు.

ముఖ్యంగా ఢిల్లీ, మీరట్, పానిపట్‌లతో ముడిపడిన రాపిడ్ రైలు ప్రాజెక్టుకు పచ్చజెండా లభిస్తుందని, యమునా నది నీటి పంపకంపై హర్యానా ప్రభుత్వంతో వివాదానికి పరి ష్కారం లభిస్తుందని, బవానా విద్యుత్తు ప్లాంటుకు గ్యాస్ లభిస్తుందని, ఈస్టర్న్, వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులు వేగంగా అమలవుతాయని ఆశిస్తున్నారు.
 అంతేకాక ఈ ఐదుగురు మంత్రుల వల్ల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలు మరింత మెరుగుపడవచ్చని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎన్సీఆర్ ప్రాంతాలకు చెందిన నలుగురు మంత్రులు సరిహద్దు నియోజకవర్గాలలోని ఓటర్లను ప్రభావితం చేస్తారని, బీజేపీ వారిని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటుందని అంటున్నారు.

హర్షవర్ధన్ పలుకుబడి కృష్ణానగర్‌తో పాటు చాందినీచౌక్ పరిధిలోని నియోజకవర్గాల ఓటర్లపై ప్రభావం చూపుతుందని బీజేపీ వర్గాలు ఆశిస్తున్నాయి. అలాగే రావ్ ఇందర్‌జీత్ సింగ్ దక్షిణఢిల్లీలోని సరిహద్దు నియోజకవర్గాల ఓటర్లను, ముఖ్యంగా జాట్ ఓటర్లను, కృష్ణపాల్ గుర్జర్ గుజ్జర్ ఓటర్లు అధికంగా ఉన్న తుగ్లకాబాద్, బదర్‌పుర్ నియోజకవర్గాలను ప్రభావితం చేస్తారని వారు అంటున్నారు. నోయిడా ఎంపీ మహేశ్ శర్మ ట్రాన్స్ యమునా ప్రాంతంలోని నియోజకవర్గాలను ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్లను ఆకట్టుకోగలరని ఆశిస్తున్నారు. ఎన్సీఆర్‌కు చెందిన నలుగురు మంత్రుల ప్రభావం తుగ్లకాబాద్, బదర్‌పుర్, మెహ్రోలీ, బిజ్వాసన్, ద్వారకా, కోండ్లీ, త్రిలోక్‌పురి, పట్పర్‌గంజ్, సీమాపురి, షహదరా, రోహతాస్, విశ్వాస్‌నగర్ నియోజకవర్గాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు