ఎన్నికలే బెటర్

13 May, 2014 23:43 IST|Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమకు అనుకూలంగా ఉండడంతో ఢిల్లీ బీజేపీలో ఆనందం వ్యక్తమవుతోంది. కేంద్రంలో తమ  సర్కారు ఖాయమన్న నమ్మకంతో ఉన్న ఆ పార్టీ నేతలు, ఇప్పుడు ఢిల్లీలోనూ తమ  ప్రభుత్వం ఏర్పాటుచేయాలని ఉబలాటపడుతున్నారు. ఇందుకోసం ప్రస్తుతమున్న అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపిస్తే పూర్తి మెజారిటీ సంపాదిస్తామని వారు భావిస్తున్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి  తమకు సంఖ్యా బలం లేదని , ప్రత్యర్థి పార్టీలను చీల్చి తమ ప్రభుత్వం ఏర్పాటుచేసే ఉద్దేశం లేదని డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు  వెలువడినప్పటి నుంచీ కమలదళ నేతలు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసిన తర్వాత ఈ మాటను వారు మరింత గట్టిగా  వినిపిస్తున్నారు.
 
 తక్షణం ఎన్నికలు జరిపించడం  తమకు లాభసాటిగా మారగలదని అంటూ వారు  అసెంబ్లీ ఎన్నికల కోసం కొత్త సమీకరణాలు రూపొందిస్తున్నారు.  ప్రస్తుత  అసెంబ్లీలో బీజేపీ సంఖ్యాబలం 32. ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి  36 మేజిక్ ఫిగర్‌గా ఉంది.  అయితే లోక్‌సభ ఎన్నికలలో ముగ్గురు శాసనసభ్యులు పోటీ చేశారు. వారు ఎన్నికలలో గెలిస్తే బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 29కి తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే  ఇండిపెండెంట్‌తో పాటు జేడీయూ ఎమ్మెల్యేపైనా ఆధారపడడంతో పాటు  ప్రత్యర్థి పార్టీలను  చీల్చక తప్పదు. ఆప్‌కు  28  మంది , కాంగ్రెస్‌కు ఎనిమిది మంది  ఎమ్మెల్యేలు ఉన్నారు.
 
 ఆప్ శాసనసభ్యులలో ఒకరు ఇప్పటికే ఆ పార్టీతో విభేదించి వేరయ్యారు. ఆయన బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇతర  పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం కంటే  మళ్లీ ప్రజల ముందుకు వెళ్లి పూర్తి మెజారిటీ సాధించి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే మేలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీని  రద్దు చేసి తక్షణం ఎన్నికలు జరిపిస్తే తమ పార్టీకి  సంపూర్ణ  మెజారిటీ రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. గతేడాది  డిసెంబర్‌లో 1,000  ఓట్ల తేడాతో ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడితే  తమకు పూర్తి మెజారిటీ సాధించడం  సులభమేనని కమల దళ నేతలు  అభిప్రాయపడుతున్నారు.
 

మరిన్ని వార్తలు