ఫిర్యాదుల కోసం ఎన్‌డీఎంసీ ప్రత్యేక యాప్

23 Feb, 2015 22:58 IST|Sakshi

 న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను నగరపాలక సంస్థ దృష్టికి తీసుకువెళ్లడానికి ఇకపై ప్రజలు అవస్థలు పడనక్కర్లేదు. తమ స్మార్ట్ ఫోన్లలో ‘ఎన్‌డీఎంసీ ప్లీజ్ ఫిక్స్’ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాని ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ప్రత్యేకంగా ఫిర్యాదుల కోసం న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) రూపొందించిన ఈ యాప్‌ని గత వారం ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా సమస్య ఉన్న ప్రాంతం నుంచే ప్రజలు క్షణాల వ్యవధిలో ఫిర్యాదు చేయడం ద్వారా అధికారులను అప్రమత్తం చేయవచ్చని ఎన్‌ఎండీసీ ప్రాజెక్ట్స్ డెరైక్టర్ ఓపీ మిశ్రా తెలిపారు. పాడైపోయిన రహదారులు, వీధి దీపాలు, చెత్త చెదారం ఇలా అన్ని సమస్యలను ఫొటోతో సహా ఫిర్యాదు చేసే సౌకర్యం ఇందులో ఉందన్నారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు అధికారులు  పర్యవేక్షిస్తూ ఉంటారని, అవసరమైతే సమస్య ఉన్న ప్రాంతాలను మ్యాప్ ద్వారా గుర్తించి తగు చర్యలు తీసుకుంటారని మిశ్రా వివరించారు.
 

>
మరిన్ని వార్తలు