‘అనూహ్య’కు న్యాయం చేయాలి

27 Jan, 2014 23:56 IST|Sakshi
‘అనూహ్య’కు న్యాయం చేయాలి

 సాక్షి, ముంబై: ముంబైలో హత్యకు గురైన ఎస్తేర్ అనూహ్యకు రోజురోజుకి మద్దతు పెరుగుతోంది. తెలుగు సంఘాలతోపాటు అనేక సంఘాలు ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీలతోపాటు హోంశాఖ మంత్రి, ఇతర రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు వినతి పత్రాలను అందిస్తున్నారు. వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులందరు ఒక్కటిగా ఏర్పడి అనూహ్య కోసం ఆందోళనలు చేపడుతున్నారు. ఇటీవలే ఆజాద్‌మైదానంలో ఆందోళ న చేసిన వీరు ఆదివారం గోపీనాథ్ ముండేతో భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టీటీ) వద్ద కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన చేశారు. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ  తెలుగు కళాసమితి ప్రధాన కార్యదర్శి, ముంబై వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు మాదిరెడ్డి కొండారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనూహ్యకు ఎల్‌టీటీ ఆవరణలో శ్రద్దాంజలి ఘటించారు. అనూహ్యను హత్యచేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేశారు.  
 
 న్యాయం జరిగేలా చూస్తాం: గోపీనాథ్ ముండే
 హత్యకు గురైన ఎస్తేర్ అనూహ్యకు న్యాయం జరిగేలా చూస్తానని లోక్‌సభ ఉప ప్రతిపక్ష నాయకుడు బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి, ముంబై వైఎస్సార్‌సీపి నాయకుడు మాదిరెడ్డి కొండారెడ్డి నేతృత్వంలో వివిధ తెలుగు సంఘాల ప్రతినిధుల బృందం సభ్యులు ఆదివారం సాయంత్రం బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండేను కలిశారు. ఈ సందర్బంగా అనూహ్య కనిపించకుండా పోయిన దగ్గరి నుంచి ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తు తీరును వివరించారు. దీనిపై స్పందించిన ఆయన అనూహ్యకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ముండేతో భేటీ అనంతరం మాదిరెడ్డి కొండారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ విజ్ఞాపనకు ముండే సానుకూలంగా స్పందించారన్నారు. నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్‌కు ఫోన్ చేసి కేసు వివరాలను తెలుసున్నారన్నారు. ఇప్పటివరకు లభించిన ఆధారాలతో హైద రాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాలకు పోలీసు బృందాలు వెళ్లాయని, రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేసే అవకాశముందని చెప్పినట్లు కొండారెడ్డి తెలిపారు.  ఇది ఒక్క తెలుగు అమ్మాయి ఎస్తేర్ అనూహ్య  అనే కాకుండా, ఇది మహిళలందరి భద్రత అంశంగా ముండే పేర్కొన్నారన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర అసెంబ్లీతోపాటు పార్లమెంట్‌లో లేవనెత్తుతామని హామీని ఇచ్చారన్నారు.
 
  ముంబైలోని తెలుగు సంఘాలతోపాటు ఇతర సంఘాలు అనూహ్యకు మద్దతుగా చేస్తున్న ఆందోళనలకు తన మద్దతు ఉం టుందని ముండే చెప్పినట్టు కొండారెడ్డి చెప్పారు. ముండేతో భేటీ అయిన వారిలో ముంబై, నవీ ముంబై, ఠాణే, భివండీ చుట్టుపక్కలలోని వివిధ తెలుగు సంఘాలు ప్రతినిధులున్నారు.  వీరిలో పోతు రాజారాం, వీరబత్తిని చంద్రశేఖర్, మంతెన రమేష్, మర్రి జనార్దన్, భోగ సహదేవ్, వాసాలా శ్రీహరి, యెల్ది సుదర్శన్, అనుమల్ల రమేష్, శెకెల్లి రాములు, బడుగు విశ్వనాథ్, కంటె అశోక్, మచ్చ ప్రభాకర్, గట్టు నర్సయ్య, విజయ, అనురాధ, కస్తూరి హరిప్రసాద్, బండి హర్యన్ రెడ్డి, కె భాస్కర్ రెడ్డి, రవీ గౌడ్, గుంటుక కోటి రెడ్డి, వై వి నారాయణ రెడ్డి, ఎవి నాగేశ్వర్ రావ్, సంకు సుధాకర్, మార్గం రాజ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు