రాష్టంలో రెండో ఎయిర్‌పోర్టు 

1 Jun, 2018 08:03 IST|Sakshi
కేంద్ర విమానయాన మంత్రి ట్విటర్‌ సందేశం

భువనేశ్వర్‌ : రాష్ట్రంలో రెండో విమానాశ్రయం ప్రారంభం కానుంది. రాజధాని భువనేశ్వర్‌ నగరం శివారు ఖుర్దా ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. నగరంలో రెండో విమానాశ్రయం ఏర్పాటు కోసం స్థలం గుర్తింపు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పౌర విమానయాన విభాగం ప్రకటించింది. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసేందుకు   కృషి చేస్తామని పౌర విమానయాన విభాగం ట్వీట్‌ చేసింది. కేంద్ర పెట్రోలియం, దక్షత అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ ప్రభాకర్‌ బాబుకు ఈ నెలలో లేఖ రాశారు. రాష్ట్రంలో రెండో విమానాశ్రయం ఏర్పాటు అవసరాల్ని ఆయన   లేఖలో వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న విమానాశ్రయంలో సదుపాయాలు కుదించుకుపోయే రీతిలో ప్రయాణికుల రవాణా పుంజుకుంటోంది.

ప్రయాణికుల అనుపాతంలో విమానాశ్రయం విస్తరణకు అనుకూల పరిస్థితులు లేవు. మరో వైపు తరచూ పక్షులు ఢీ కొనడం వంటి  సమస్యలు కూడా వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నగరంలో రెండో విమానాశ్రయం ఏర్పాటు అనివార్యమని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాసిన లేఖపట్ల కేంద్ర విమానయాన విభాగం నెల రోజులు తిరగకుండా సానుకూలంగా స్పందించడం విశేషం. 2017–18 ఆర్థిక సంవత్సరంలో స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 39.4 అభివృద్ధి రేటును సాధించింది. జాతీయ స్థాయిలో శరవేగంగా పుంజుకుంటున్న విమానాశ్రయాల్లో ఒకటిగా దూసుకుపోతోంది. రన్‌–వే, స్థలం కొరత వంటి సమస్యలతో విమానాల రవాణాకు ఇబ్బంది కలుగుతోంది. ప్రతిపాదిత కొత్త విమానాశ్రయం ఏర్పాటుతో విమానాల ల్యాండింగ్‌ ఇతేరతర సమస్యలు దూరమవుతాయి. 

గత ఏడాది నుంచే సన్నాహాలు
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి నగరంలో రెండో విమానాశ్రయం కోసం సన్నాహాలు ప్రారంభించింది. నగరం శివారు ఖుర్దా జిల్లా మల్లిపడా, జంకియా, టొంగియాపడా, బొడొసాహి ప్రాంతాల్లో రెండో విమానాశ్రయం కోసం స్థలాల్ని ప్రతిపాదించింది. గత ఏడాది డిసెంబర్‌లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ స్థలాల్లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టు ప్రాజెక్టును చేపట్టేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కోడ్‌–2 లేదా భారీ విమానాలను ఈ ప్రాంతాల్లో ల్యాండింగ్‌ చేసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  

>
మరిన్ని వార్తలు