సణుగుడు గొణుగుడు

26 Nov, 2014 23:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల తేదీ ఇంకా ప్రకటించనేలేదు, కాంగ్రెస్ పార్టీలో అప్పుడే అసంతృప్తి, పెదవి విరుపులు మొదలయ్యాయి. ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో తమకు ఇచ్చిన హోదాపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు జూనియర్ మంత్రిగా పని చేసిన అర్విందర్‌సింగ్ లవ్లీ నేతృత్వంలోని కమిటీలో ‘నేను పని చేయడమా?’ అని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పెదవి విరిచినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన అంగీకారం లేకుండా, కనీసం తనకు చెప్పకుండా తన పేరును కమిటీలో చేర్చడంపై దీక్షిత్ బాహాటాంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ ప్రకటించిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో దీక్షిత్‌తో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రతిష్టను పునరుద్ధరించగలరన్న పూర్తి నమ్మకాన్ని కేంద్ర నాయకత్వం అర్విందర్ సింగ్‌పై ఉంచింది. లవ్లీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఢిల్లీ కాంగ్రెస్‌లోని రెండు గ్రూపుల మధ్య ఉన్న విభేదాలను సైతం ఈ కమిటీ ఏర్పాటు బట్టబయలు చేసింది. ఒక గ్రూపు షీలాదీక్షిత్‌కు సన్నిహితమైనది కాగా, మరో గ్రూపు ఆమె అధికారంలో ఉన్న 15 ఏళ్ల కాలంలో ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన వారితో కూడి ఉంది. ‘‘షీలాదీక్షిత్ ఏ కమిటీలోనూ పని చేయడానికి సుముఖంగా లేరు. కానీ పార్టీకి మరో విధంగా సేవ చేయాలని ఆమె భావిస్తున్నారు’’ అని ఓ మాజీ ఎమ్మెల్యే చెప్పారు. ఈ ఎన్నికల కమిటీని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేశారని, షీలాదీక్షిత్ సహా ఎవరైనా సరే ఆ నిర్ణయంపై స్పందించడం వల్ల కలిగే ప్రయోజనమేదీ లేదని అర్వింద్ లవ్లీకి సన్నిహితుడైన మరో నేత అన్నారు. ఎన్నికల కమిటీపై ఎవరికీ ఎలాంటి అసంతృప్తి లేదని కాంగ్రెస్ ఢిల్లీ ప్రదేశ్ ప్రధాన ప్రతినిధి ముఖేశ్ శర్మ చెప్పారు.
 

మరిన్ని వార్తలు