ప్రత్యేకతల గడ్డ ‘న్యూఢిల్లీ’!

9 Mar, 2014 23:11 IST|Sakshi
ఇక్కడి నుంచి పోటీ చేసినవారిలో పరప్రాంతీయులే ఎక్కువ
  గెలిచిన అభ్యర్థులు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినవారే
  ఈసారీ పరప్రాంతీయులే ఎక్కువమంది బరిలో నిలిచే అవకాశం
  అజయ్ మాకెన్ పేరును దాదాపుగా ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ
  మీనాక్షి, నిర్మలా, సుబ్రమణ్యస్వామి పేర్లను పరిశీలిస్తున్న బీజేపీ
  ఆసక్తికరంగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి పేరు ప్రకటన
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏడు పార్లమెంటు నియోజకవర్గాలలో న్యూఢిల్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. దేశంలోనే అత్యంత సంపన్నశ్రేణి నియోజకవర్గంగా  దీనిని పేర్కొంటారు. వాజ్‌పేయి, అద్వానీ, రాజేష్‌ఖన్నా వంటి  హేమాహేమీలను గెలిపించిన నియోజకవర్గమిది. ఇక్కడి నుంచి గెలిచిన ఎంపీలే కాదు ఇక్కడి ఓటర్లలో పలువురు  దేశచరిత్ర ను లిఖించిన వీవీఐపీలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బరిలోకి దిగినంత మంది పరప్రాంతీయులు దేశంలో మరెక్కడా పోటీకి దిగ కపోవడం మరో ప్రత్యేకతగా పేర్కొనాలి. రాజేష్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా వంటి సినీ దిగ్గజాల నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ వంటి రాజకీయ దిగ్గజాల వరకు  పలువురు  అభ్యర్థులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. ఈ నియోజకవర్గానికి నిర్వహించిన మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన సుచేతా కృపలానీ నుంచి గత లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన అజయ్ మాకెన్  వరకు ఇక్కడి నుంచి గెలిచిన అభ్యర్థులు కేంద్ర మంత్రిమండలిలో  సభ్యులయ్యారు.
 
 ఈ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ మాకెన్ పేరు ఇప్పటికే ఖాయం కావడంతో బీజేపీతోపాటు  అసెంబ్లీ ఎన్నికలలో న్యూఢిల్లీలో సత్తాచాటిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఎవరికి టికెట్ ఇస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది.  న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ  ఎవరికి టికెట్ ఇస్తుందన్నది ఇంకా రాజకీయపండితుల ఊహకు అందడం లేదు. బీజేపీ మాత్రం మరోమారు ఇక్కడి నుంచి పరప్రాంత అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.న్యూఢిల్లీ నియోజకవర్గం అభ్యర్థి కోసం బీజేపీ మీనాక్షీ లేఖీ, నిర్మలా సీతారామన్, సుబ్రమణ్యస్వామి పేర ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పరదేశీ అభ్యర్థులను ఎన్నికల బరిలో చూడడం న్యూఢిల్లీ ఓటర్లకు కొత్తేమీ కాదు. 
 
 సినీజగత్తు నుంచి రాజకీయ జగత్తులోకి వచ్చిన రాజేష్‌ఖన్నా, శత్రుఘ్న సిన్హాల రాజకీయ జీవితం ఇక్కడి నుంచే మొదలైంది. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఉత్తర ప్రదేశ్ నుంచి ఢిల్లీకి వచ్చి న్యూఢిల్లీ సీటు నుంచే రెండుసార్లు గెలిచారు. అలాగే గుజరాత్ నుంచి వచ్చిన ఎల్‌కే అద్వానీ ఇక్కడి నుంచి రెండు సార్లు పోటీచేసి గెలిచారు. న్యూఢిల్లీ నియోజకవర్గ చరిత్రను చూస్తే ఈ నియోజకవర్గం నుంచి  సుచేతా క ృపలానీ, కె.సి.పంత్, వాజ్‌పేయి, అద్వానీ , అజయ్ మాకెన్ రెండేసి సార్లు గెలవగా, జగ్‌మోహన్ మూడుసార్లు, బలరాజ్ మధోక్, మెహర్ చంద్ ఖన్నా,  మనోహర్ లాల్ సోంధీ,  రాజేష్ ఖన్నా ఒకసారి గెలిచారు.  ఈ నియోజకవర్గం రెండు సార్లు ఉప ఎన్నికలను చవిచూసింది. గత లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు చెందిన అజయ్ మాకెన్ బీజేపీకి చెందిన విజయ్ గోయల్‌ను ఓడించారు.
 
>
మరిన్ని వార్తలు