ఎన్డీఎంసీ రద్దు..!

10 Sep, 2014 22:34 IST|Sakshi

న్యూఢిల్లీ: పరిపాలనా వైఫల్యం కారణంగా న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ)ను రద్దు చేస్తున్నట్లు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటించింది. నగరంలోని సంపన్నవర్గాలుండే లూట్యెన్స్ ప్రాంతంలో జనవరి 2011లోన్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. మూడు కార్పొరేషన్ విభజనతో మునుపటి కౌన్సిల్‌ను రద్దు చేసిన తర్వాత ఏర్పాటు చేసిన ఎన్డీఎంసీ ఆర్థిక సమస్యలతోపాటు పరిష్కరించలేని పలు సమస్యలను ఎదుర్కొంటోందని, కనీసం కబ్జాలను కూడా నిరోధించలేకపోతోందని, అందుకే ఎన్డీఎంసీని రద్దు చేయాలని నిర్ణయించినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
 
 వ్యక్తిగత అవకతవకలు కూడా భారీగానే చోటుచేసుకుంటున్నాయని, రోజువారి వేతనాల చెల్లింపు, హాజరు పట్టిక నిర్వహణ, తాత్కాలిక హాజరుపట్టిక నిర్వహణ, ఒప్పంద ఉద్యోగుల విధుల నిర్వహణ తదితరాల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొం ది. ఎన్డీఎంసీ రద్దుతో ఆ సంస్థ నిర్వహిస్తున్న బాధ్యతలను ఐఏఎస్ స్థాయి అధికారులకు అప్పగించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఎన్డీఎంసీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకే ఈ బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం నోటిఫికేషన్‌లో చేసింది. ఎన్డీఎంసీలో కొనసాగుతున్న అధికారులకు ఇతర విధులను అప్పగించాలని సూచించింది.
 
 ఎన్డీఎంసీలో పౌరవిభాగం సభ్యులుగా బీజేపీ నేత మీనాక్షి లేఖీతోపాటు అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు మరో పదిమంది సభ్యులున్నట్లు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. నిజానికి ప్రస్తుత ఎన్డీఎంసీని ఏర్పాటైన ఐదేళ్ల తర్వాతే రద్దు చేయడానికి అవకాశముంది. కానీ ఇటువంటి అవకతవకలేవైనా జరుగుతున్నప్పుడు మధ్యలో కూడా రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉందని ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ చట్టం, 1994 చెబుతోంది.
 

మరిన్ని వార్తలు