సుదీర్ఘకాలం తర్వాత..

23 Feb, 2014 00:39 IST|Sakshi
సుదీర్ఘకాలం తర్వాత..

 నగరంలో కొత్త బస్సు డిపో ఏర్పాటు
 18 ఏళ్ల తర్వాత గోరేగావ్-మలాడ్‌ల మధ్య నిర్మాణం
 లక్షమంది ప్రయాణికులకు ఉపయోగం
 
 సాక్షి, ముంబై: నగరంలో 18 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మరో కొత్త బస్ డిపోను నిర్మించనున్నారు. గోరేగావ్-మలాడ్‌ల మధ్య నగరవాసులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంచేందుకు కొత్త బస్‌డిపోను ఏర్పాటు చేయనున్నట్లు బెస్ట్ జనరల్ మేనేజర్ ఓంప్రకాష్ గుప్తా వెల్లడించారు. నగరంలో ఇప్పటికే 25 డిపోలుండగా ఇది 26వది. ఈ బస్‌డిపోను  మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభించనుంది. గోరేగావ్-మలాడ్‌ల మధ్య ఉన్న చించోలి వద్ద దాదాపు 18,440 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.9.10 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. ఇందులో దాదాపు 115 బస్సులను ఉంచనున్నారు. 14 కొత్త రూట్ల మధ్య ఈ బస్సులు సేవలు అందించనున్నాయి. ఇదిలా ఉండగా గోరేగావ్, మలాడ్‌ల మధ్య ఐటీ హబ్‌లు, మాల్స్, రెసిడెన్షియల్ కాలనీలు ఎక్కువగా ఉండడంతో ప్రయాణికుల డిమాండ్ మేరకు ఈ బస్ డిపోను కొత్తగా నిర్మించనున్నట్లు గుప్తా వివరించారు.
 
 ఈ డిపో వల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న లక్షకు పైగా ప్రయాణికులు లబ్ధి పొందనున్నారని ఆయన చెప్పారు. కాగా, 1996లో తూర్పు జోగేశ్వరిలో చివరిసారిగా ‘మజస్’ డిపోను ప్రారంభించారు. తిరిగి 18 ఏళ్ల తర్వాత కొత్తగా ఈ బస్ డిపో నిర్మాణం చేపడుతున్నారు. ఇదిలా వుండగా చించోలి డిపో నుంచి బస్సులు కేవలం సమీప రైల్వేస్టేషన్ వద్దకే కాకుండా ఐటీ సెంటర్లకు కూడా తరచూ సేవలు అందించనున్నాయి. అంతేకాకుండా నగర తూర్పు శివారు ప్రాంతాలైన ఘాట్కోపర్, ములుండ్‌లకు కూడా తమ సేవలను అందించనున్నాయి. అంతేకాకుండా ఈ డిపో నుంచి వడాలా, సైన్ ప్రాంతాలకు కూడా రోజూ బస్సులను నడపనున్నట్లు అధికారి వెల్లడించారు. అంతేకాకుండా మార్చి ఒకటో తేదీన బెస్ట్ సంస్థ దహిసర్‌లోని కండర్‌పాడా వద్ద మరో కొత్త బస్‌స్టేషన్‌ను ప్రారంభించనుంది. ఇటీవల జరిగిన బెస్ట్ కమిటీ సమావేశంలో కొత్త బస్ డిపో, అదేవిధంగా బస్ స్టేషన్ల ప్రతిపాదన  ఆమోదం పొందింది.
 
 ఈ సందర్భంగా బెస్ట్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ.. గోరేగావ్-మలాడ్, గోరియా ప్రాంతాల్లో చాలా మంది  బస్సులను ఆశ్రయిస్తుంటారు. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సర్వీసులను అందజేస్తున్నామన్నారు. అయితే కొత్తగా నిర్మించబోయే బస్ డిపో వల్ల మాల్వానీ, గోరాయి, గోరేగావ్ డిపోలకు కొంత మేర భారం తగ్గనుందని ఆయన తెలిపారు.  ప్రయాణికుల స్పందనను బట్టి తాము బస్సులను పెంచడమేకాకుండా కొత్త రూట్లను కూడా పరిచయం చేస్తామన్నారు. అలాగే బెస్ట్ మరో 426 కొత్త నాన్ ఏసీ బస్సులను కొనుగోలు చేయనుందని గుప్తా స్పష్టం చేశారు. వీటి కొనుగోలు తర్వాత పాత బస్సులను తొలగిస్తామన్నారు. కొత్త డిపోలో కంప్యూటరైజ్డ్ షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచనున్నామని వివరించారు.

>
మరిన్ని వార్తలు