మళ్లీ రజనీకాంత్‌ వాల్‌ పోస్టర్ల కలకలం

24 Apr, 2017 14:28 IST|Sakshi
మళ్లీ రజనీకాంత్‌ వాల్‌ పోస్టర్ల కలకలం

చెన్నై : తమిళనాడులో  రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతుంటే...మరోవైపు దక్షిణాది సూపర్స్టార్‌ రజనీకాంత్‌ వాల్‌ పోస్టర్లు మళ్లీ కలకలం రేపుతున్నాయి. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలంటూ చెన్నైలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. "ప్రజలు జీవించాలంటూ నువ్వు పాలించాలి. మిమ్మల్నే ఈ భూమి నమ్మి ఉంది. ప్రజలకు మంచి దారి చూపించు'' అంటూ పోస్టర్లలో స్లోగన్లు రాసి ఉన్నాయి. రజనీకాంత్‌ నివాసం పొయిస్‌ గార్డెన్‌ సమీపంలోని  రాధాకృష్ణన్ శాలై, జెమినీ ఫ్లైఓవర్‌ వద్ద ఈ పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ పోస్టర్లపై రజనీకాంత్‌ స్పందించాల్సి ఉంది.

కాగా రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి దించేందుకు గతంలో అభిమాన లోకం చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. అభిమానుల ఒత్తిడి శ్రుతి మించడంతో తలొగ్గిన రజనీ కాంత్ ‘దేవుడు ఆదేశిస్తే... రాజకీయాల్లోకి వస్తా..’ అన్న మెలిక పెట్టారు. దీంతో అభిమానుల నోళ్లకు తాళం వేయించారు. అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి దింపే ప్రయత్నాలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీతో రజనీ కాంత్‌కు ఉన్న మిత్రత్వం ఇందుకు ఓ కారణం. దక్షిణాదిలో కర్ణాటకలో బలంగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బలం పుంజుకుంటున్నా, తమిళనాడులో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా బీజేపీ పరిస్థితి ఉంది.

మోదీ ప్రభావంతోపాటు, సినీ గ్లామర్‌ను తోడు చేసి తమిళనాడులోనూ పాగా వేయాలన్న లక్ష్యంతో బీజేపీ అధిష్టానం వ్యూహ రచన చేసినా, రజనీ నుంచి ఎలాంటి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు. ఈ నేపథ్యంలో జయలలిత మరణంతో మళ్లీ రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశం అంశం తెరమీదకు వచ్చింది. దీనిపై ఆయన మాత్రం పెదవి విప్పడం లేదు. గతంలోనూ రజనీ అభిమానులు ... సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు  వెలిపించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు