మేయర్ పదవే కాదు సీఎం పీఠం కూడా మాదే

23 Feb, 2017 19:52 IST|Sakshi
మేయర్ పదవే కాదు సీఎం పీఠం కూడా మాదే

ముంబై: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత శివసేన చీఫ్‌ ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై మేయర్ తో పాటు తర్వాతి ముఖ్యమంత్రి కూడా శివసేనకు చెందినవారే అవుతారని ఉద్దవ్ ఠాక్రే అన్నారు.

ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో (బీఎంసీ) శివసేన అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 84 సీట్లను గెల్చుకోగా, బీజేపీ 82 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 227 కార్పొరేటర్ స్థానాలు ఉండే బీఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి తగిన మెజార్టీ రాలేదు. శివసేన థానెలోనూ అతిపెద్ద పార్టీగా నిలవగా, మిగిలిన 8 కార్పొరేషన్లలో బీజేపీ హవా నడిచింది. బీఎంసీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలవడంతో శివసేన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు, తమ పార్టీ మరో వైపు నిలిచిందని, అయినా తామే నెంబర్ వన్ స్థానంలో నిలిచామని చెప్పారు. ముస్లింలు కూడా తమకే ఓట్లు వేశారని, ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు కావడంలో బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. చాలా చోట్ల తమ పార్టీ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారని చెప్పారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ-శివసేన సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాతి ముఖ్యమంత్రి తమ పార్టీకి చెందిన వ్యక్తి అవుతారని ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 

మరిన్ని వార్తలు