మహిళలతో ఎలా వ్యవహరించాలంటే..

20 Aug, 2013 00:15 IST|Sakshi

సాక్షి, ముంబై: ఫిర్యాదు చేయడానికి స్టేషన్లకు వచ్చే మహిళలతో మర్యాదగా వ్యవహరించేందుకు నగర పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నారు. మహిళలు, చిన్న పిల్లల కేసుల్లో ఎలా నడచుకోవాలనే విషయమై కొన్ని స్వచ్ఛందసంస్థలు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నాయి. ఎవరైనా ఒక మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు ఆమెతో ఎలా ప్రవర్తించాలనే విషయమై కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఎన్జీఓ నేహా ప్రోగ్రామ్ డెరైక్టర్ నైరీన్ దారువాలా తెలిపారు. అంతేగాకుండా పోలీసు స్టేషన్‌కు వచ్చిన మహిళ పరిస్థితిని అర్థం చేసుకొని సౌమ్యంగా స్పందించాలని పోలీసులకు సూచించారు. వి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ధనంజయ్ కులకర్ణి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించే ప్రతి ఒక్క మహిళకూ న్యాయం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే కొన్ని సందర్భాల్లో మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తున్న విషయం నిజమేనని అంగీకరించారు. ఈ విషయమై తమకు ఫిర్యాదులు కూడా అందాయని ధనుంజయ్ తెలిపారు.
 
 శిక్షణలో భాగంగా పోలీసులకు సెప్టెంబర్ మొదటివారంలో ప్రత్యేక సుహృద్భావ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సీనియర్ పోలీస్ అధికారులతోపాటు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పౌరులు పాల్గొననున్నారు. అంతేగాక జోన్ 3, 4, 5, 6కు చెందిన పోలీసుల కోసం రెండు రోజుల శిక్షణ  కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పోలీసులను బృందాల వారీగా విభజించి శిక్షణ ఇస్తారు. ఒక్కో బృందంలో 50 మంది కానిస్టేబుళ్లతోపాటు అధికారులు ఉంటారని దారువాలా తెలిపారు. ‘మహిళల కేసులను దర్యాప్తు చేస్తున్నప్పుడు నియమనిబంధనలను తప్పకుండా పాటించాలి. వారికి సంబంధిత చట్టాల గురించి తెలియజేయడం ద్వారా కూడా వారికి హింస నుంచి రక్షణ కల్పించవచ్చు’ అని ఆమె తెలిపారు. ఈ శిక్షణలో చిన్న చిన్న నాటకాలను కూడా ప్రదర్శించనున్నారు.
 
 ఈ శిక్షణలో పోలీసులు పాల్గొన్న తరువాత.. వివిధ సందర్భాల్లో ఇక నుంచి వారు ఎలా స్పందిస్తారో ప్రత్యక్షంగా చేసి చూపించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా, ముంబై పోలీసులు మహిళల కోసం నగరవ్యాప్తంగా నాలుగువేల ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయనున్నారు. వీటిని ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా 150 మంది సిబ్బంది కన్నా తక్కువగా ఉన్న పోలీస్టేషన్లలో ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు లేదా పోలీసు అధికారులను నియమించనున్నారు. ఇందుకోసం ఇటీవల 140 మంది మహిళా పోలీసులకు శిక్షణ కూడా ఇచ్చి గుర్తింపుకార్డులు జారీ చేశారు. మహిళలపై నేరాలు నిరోధించడానికి వీళ్లు పనిచేస్తారు. మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు 300 నంబర్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని కులకర్ణి సూచించారు.

మరిన్ని వార్తలు