జయపురం, కొట్‌పాడ్‌లలో విస్తృతంగా దర్యాప్తు

9 Feb, 2018 19:33 IST|Sakshi
జయపురం ఆస్పత్రిలో జాతీయ మానవ హక్కుల కమిటీ బృందం

పర్యటించిన మానవ హక్కుల కమిషన్‌ బృందం

జయపురం/కొరాపుట్‌: కొరాపుట్‌ జిల్లా కుందులి గ్యాంగ్‌రేప్‌ బాధితురాలి కేసులో నిజానిజాలు వెలికితీసేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ పంపించిన దర్యాప్తు బృందం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ దర్యాప్తు చేస్తోంది. కొరాపుట్, కుందులి, బాధితురాలి గ్రామం ముషి గుడలను సందర్శించి ఆయా ప్రాంతాలలో అనేక మందిని, ముఖ్యంగా ఆమె బంధువర్గాన్ని ఆమెకు వైద్యసేవలందించిన డాక్టర్లను, పోలీసులు విచారణ చేసిన తరువాత జయపురం, కొట్‌పాడ్‌లలో  పర్యటించింది. ఈ పర్యటనలో ఆమెను ఉంచిన ప్రాంతాలను,  వైద్య చికిత్స చేసిన జయపురం ప్రభుత్వ సబ్‌డివిజన్‌ ఆస్పత్రిని సందర్శించి అనేక విషయాలను తెలుసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ టీమ్‌లో కొంతమంది జయపురం, కొట్‌పాడ్‌లలో పర్యటించి అనేక విషయాలపై దర్యాప్తు జరిపినట్లు సమాచారం. రవిసింగ్‌ నేతృత్వంలో టీమ్‌ మొదట కొట్‌పాడ్‌ వెళ్లి  అక్కడ శిశు పరిరక్షణ కేంద్రాన్ని సందర్శించింది. ఆ కేంద్రంలో కుందులి బాధితురాలిని అధికారులు కొన్ని రోజులు  ఉంచారు. ఆమె అక్కడ ఉన్న సమయంలో ఇతరులతో ఎలా ఉండేది, ఆమె మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండేది. ఆమె అక్కడ ఉన్న వారితో ఏమైనా చెప్పిందా? ఎన్నాళ్లు కేంద్రంలో ఉంది?  తదితర   విషయాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పూర్తి వివరాలు సేకరించిన టీమ్‌ జయపురం  వచ్చి బాధితురాలిని అధికారులు  కొద్దిరోజులు   ఉంచిన స్టేహోంను సందర్శించింది. అక్కడ ఉన్నవారిని బాధితురాలి వివరాలు అడిగి తెలుసుకుంది.

వైద్యాధికారి విచారణ
ఆమె  స్టేహోంలో  ఉన్న సమయంలో అనారోగ్యానికి గురైతే వైద్యం కోసం ఎక్కడికి తీసుకు వెళ్లారని స్టే హోం నిర్వాహకులను అడిగి తెలుసుకుంది. ఆ సమయంలో  బాధితురాలిని జయపురం సబ్‌డివిజన్‌ ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించిన విషయం తెలుసుకుని ఆస్పత్రిని సందర్శించింది. హాస్పిటల్‌లో బాధితురాలు ఉన్న సమయంలో ఆమెకు ఎవరు ట్రీట్‌మెంట్‌ చేశారు. ఆమె పరిస్థితి ఎలా ఉండేదని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో టీమ్‌ ప్రతినిధులు పలువురు ఆస్పత్రి ఉద్యోగులను విచారణ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా జయపురం హాస్పిటల్‌లో ఉన్న సమయంలో  బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయంపై సబ్‌డివిజన్‌ ప్రభుత్వ హాస్పిటల్‌ అధికారి డాక్టర్‌  దొధిబామణ త్రిపాఠిని ప్రశ్నించినట్లు తెలిసింది. అక్కడి  నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ టీమ్‌ భరిణిపుట్‌ గ్రామ పంచాయతీ బి.మాలిగుడలో బాధితురాలి బంధువుల ఇంటికి వెళ్లి వారికి తెలిసిన వివరాలు సేకరించారు. ఈ పర్యటనలో మానవ హక్కుల కమిషన్‌ బృందంతో పాటు కొరాపుట్‌ జాల్లా శిశు సురక్షా సమితి అధికారి, పోలీసులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు