-

మదురైలో ఎన్‌ఐఏ సోదాలు

17 Jun, 2019 09:10 IST|Sakshi

ముగ్గురిని విచారిస్తున్న బృందాలు

సాక్షి, చెన్నై: తమిళనాడులోని మదురైలో ఆదివారం ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేపట్టాయి. శ్రీలంక ఆత్మాహుతి బాంబర్‌ జహ్రన్‌ హషీంకు ఫేస్‌బుక్‌ స్నేహితుడైన తమిళనాడుకు చెందిన ఐఎస్‌ఐఎస్‌ఐ మాడ్యుల్‌ సూత్రధారి మహ్మద్‌ అజారుద్దీన్‌ను కోయంబత్తూరులో ఎన్‌ఐఏ అధికారులు రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో అజారుద్దీన్‌ తెలిపిన వివరాల మేరకు ఇదయతుల్లాను అరెస్టు చేయగా, మరో ఐదుగురిని విచారిస్తున్నారు.

కోయంబత్తూరుకు చుట్టుపక్కల రెండు రోజుల పాటు సోదాలు చేసిన ఎన్‌ఐఏ బృందాలు ఆదివారం మదురైకు మకాం మార్చాయి. ఆధ్యాత్మిక నగరం మదురైలో పేలుళ్ల విధ్వంసం సృష్టించేందుకు వ్యూహరచన చేసినట్లుగా లభించిన సమాచారం మేరకు ముగ్గురు యువకుల్ని లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఐఏ వర్గాలు తనిఖీలు, విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా విల్లాపురం హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఈ సోదాలు పొద్దు పోయే వరకు సాగాయి. సదాం కుమారుడు ముర్షిద్‌ సహా ముగ్గుర్ని రహస్య ప్రదేశంలో ఉంచి అధికారులు విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు