దాడివల్లనే నిడో మృతి

11 Feb, 2014 00:44 IST|Sakshi
 సాక్షి, న్యూఢిల్లీ: దాడి కారణంగానే అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన నిడో తానియా మృతిచెందినట్లు నిర్ధారణ అయ్యింది.  తలపైనా, ముఖంపైనా గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. గత నెల 30న గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో నిడో తానియా మృతిచెందిన విషయం విదితమే. అయితే లజ్‌పత్‌నగర్‌లో దుకాణదారులు జాతి వివక్షతో కొట్టిన దెబ్బల కారణంగానే నీడో మరణించాడని అతని మిత్రులు, కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో నిడో మరణంపై ఎయిమ్స్ అందించిన పోస్టుమార్టం నివేదికను పోలీసులు హైకోర్టుకు సోమవారం సమర్పించారు. పదునైన వస్తువుతో తలపైనా, ముఖంపైనా కొట్టిన దెబ్బలకు నిడో మరణి ంచాడని పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. నిడో హత్యకు సంబంధించి ముగ్గురు నిందితులను నగర పోలీసులు అరెస్టు చేశారు.
 
 ఇద్దరు మణిపూర్ యువకులపై దాడి
 ఈశాన్యరాష్ట్రాలకు చెందిన పౌరులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిడో తానియా ఘటన మంట చల్లారకముందే మరో ఇద్దరు మణిపూర్ యువకులపై ఆదివారం రాత్రి దాడి జరిగింది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. గింఖాన్‌సూన్ నౌలక్(24), అతని సోదరుడు ఉమ్‌సాన్‌ముంగ్ నౌలక్ (25)లు మార్కెట్‌కు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి రాత్రి ఎనిమిది గంటల సమయంలో దాడి చేశారని పోలీసులు తెలిపారు. దీంతో వారిద్దరిని ఎయిమ్స్‌లో చికిత్స నిమిత్తం చేర్చినట్లు చెప్పారు. కాగా ఉమ్‌సాన్‌ముంగ్ నౌలక్‌ను డిశ్చార్జి చేశారు.
 
 గింఖాన్‌సూన్ నౌలక్ అందులోనే చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. దుండగులు తమ వద్ద నుంచి ఎలాంటి దోపిడీకి ప్రయత్నించలేదని, జాతి వివక్ష కారణంగానే దాడి చేశారని బాధితులు ఆరోపించారు. జాతివివక్షతో అరుణాచల్‌ప్రదేశ్ యువకుడిని దాడిచేసి చంపిన ఘటన ఇటీవల చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనపై ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మంట చల్లారముందే ఇద్దరు మణిపూర్ వాసులపై దాడి జరగడం సంచలనం సృష్టించింది. కాగా నగరంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారిపై ఇటీవల దాడులు పెరిగిన సంగతి విదితమే. 
 
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా