8మంది నైజీరియన్ల అరెస్ట్

29 Jun, 2015 04:42 IST|Sakshi
8మంది నైజీరియన్ల అరెస్ట్

బెంగళూరు(బనశంకరి): మారుతున్న కాలానికి అనుగుణంగా ఆన్‌లైన్ వ్యాపారంలో అందుబాటులోకి రావడంతో, దాన్ని కూడా దుర్వినియోగానికి ఉపయోగించుకున్నారు ఈ నైజీరియన్లు. ఎట్టకేలకు పోలీసులు వలపన్ని 8 మందిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే, పేరుపొందిన ఆన్‌లైన్ కంపెనీలైన క్వికర్, ఓఎల్‌ఎక్స్ ద్వారా ప్రజలను వంచిస్తున్న ఆరుగురు నైజీరియన్ పర్యాటకులతోపాటు ఇద్దరు మహిళలను కలిపి మొత్తం 8 మందిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టయిన వారిలో నైజీరియాకు చెందిన బోలాజీ, అతని భార్య చుకుఒకపాల, ఆవేరియల్‌లావల్, ఓకాజికాలింగ్, ఓజాలావల్, క్రస్టినాఒబినా తదితరులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇంకా ఈ గ్యాంగ్‌లో ముగ్గురు పరారీలో ఉండడంతో వారికోసం గాలిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్.రెడ్డి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితులు ఆన్‌లైన్‌లో ఖరీదైన కార్లు, వస్తువులు, పెంపుడు కుక్కల ఫొటోలను పెట్టి తక్కువ ధరకు ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తారు. జూన్ 20 తేదీన శేఖర్ అనే వ్యక్తికి తక్కువ ధరకు కారు ఇస్తామన్నారు.

ఆ కారును ఎయిర్‌పోర్టులో నిలిపి అత్యవసర పనిమీద విదేశాలకు వెళుతున్నట్లు చెప్పారు. నైజీరియన్ గ్యాంగ్‌లో ఓ మహిళ మొబైల్ నెంబర్ ఇచ్చి ఆమెను సంప్రదించాలని శేఖర్‌కు తెలిపారు. మొబైల్‌కు ఫోన్ చేసిన తక్షణం మహిళ తాను కస్టమ్స్ అధికారిని అంటూ చెప్పి కారు కొనుగోలుకు సంబంధించి డబ్బును బ్యాంక్ ఖాతాలో జమ చేసుకుంది. వెంటనే ఏటీఎం ద్వారా నగదు డ్రా చేసుకుని కారు ఇవ్వకుండా వెళ్లిపోయింది. దీనిపై శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటన పై చిక్కపేటే పోలీసులు కేసు నమోదు చేసుకుని, గాలింపు చేపట్టారు. పోలీసులు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి నైజీరియన్ గ్యాంగ్ ఆచూకీ కనుగొన్నారు.  నైజీరియన్లు వంచనకు పాల్పడిన సమయంలో వందలాదిసిమ్ కార్డులు, అనేక బ్యాంక్ ఖాతాలు తెరిచి ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేగాక బరాక్‌ఒబామా, మిషెల్ ఒబామా తదితర పేర్లుతో నకిలీ ఫౌండేషన్లు స్థాపించినట్లు కూడా తెలిసింది.

వీటితో పాటు నకిలీ పాస్‌పోర్టు, వీసా, పాన్‌కార్డులను తయారు చేయడం, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. వీరి అరెస్ట్‌తో 12కు పైగా కేసులు వెలుగుచూశాయి. వంచనకు గురైన ప్రజలు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందిస్తే విచారణకు వీలుగా ఉంటుందన్నారు. అరెస్టయిన నైజీరియన్ గ్యాంగ్‌లో ప్రముఖ ఆరోపి బోలాజీ హెణ్ణూరులో ఒక ఏడాది క్రితం తమ దేశంలో ఓ యువకుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిపింది.

మరిన్ని వార్తలు