ఆ మందు వాడి ఉంటే..

28 May, 2018 09:44 IST|Sakshi
 ఫిర్యాదు చేసిన అజిత్‌ కుమార్‌ పట్నాయక్‌ , నిరామయి  అందజేసిన ఔషధం  

కొరాపుట్‌ : దగ్గు, జలుబుకు వైద్యుడు సూచించిన ఔషధానికి బదులు దురదలకు పైపూతగా వాడవలసిన లోషన్‌ను ఉచిత మందుల దుకాణం నిరామయి అందజేసిన ఉదంతం ఆదివారం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. స్థానిక పూజారిపుట్‌కు చెందిన అజిత్‌ కుమార్‌ పట్నాయక్‌ భార్య తన మూడేళ్ల  కొడుకు దగ్గు,  జలుబుతో బాధపడుతుండగా మెడికల్‌ కాలేజీ చైల్డ్‌ స్పెషలిస్ట్‌ అరఖిత స్వంయి వద్దకు వైద్యం కోసం ఉదయం తీసుకువెళ్లింది. ఆ స్పెషలిస్టు దగ్గు, జలుబు కోసం ప్రిస్క్రిప్షన్‌లో రాసిన మందుకు బదులుగా దురదలకు వాడవలసిన లోషన్‌ను నిరామయిలో ఆమెకు అందజేశారు. ఇంటికి వెళ్లి భర్తకు ప్రిస్క్రిప్షన్, మందును ఆమె చూపించింది.

భర్త అజిత్‌ కుమార్‌ పట్నాయక్‌ ప్రిస్క్రిప్షన్‌లోని మందు మారినట్లు గుర్తించి, లోషన్‌తో పాటు తన కుమారుని తీసుకుని  చైల్డ్‌ స్పెషలిస్ట్‌ స్వంయి వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆ లోషన్‌ తాగించి ఉంటే ప్రాణాపాయం సంభవించేదని తాగించకుండా తన దగ్గరకు రావడం మంచిదైందని స్పెషలిస్ట్‌ వైద్యుడు అన్నారు. ఈ విషయం  హస్పిటల్‌ ఆవరణలో సంచలనం సృష్టించింది. పొరపాటు చేసిన నిరామయి సిబ్బందిపై హాస్పిటల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కాళీప్రసాద్‌ బెహర మండిపడుతూ విచారణ జరిపి సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు