చిక్కుల్లో నిర్మల

27 Jul, 2018 08:38 IST|Sakshi

నిర్మలా సీతారామన్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్‌

పోనీలే పాపం.. అని సానుభూతి చూపడం ఆమె పాలిట శాపంగా మారింది.రహస్యంగా చేసిన సాయం రట్టుకావడం రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌నుచిక్కుల్లో పడేసింది. రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాల పట్టుబట్టడాన్నిఎదుర్కొవాల్సిన పరిస్థితి తలెత్తింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై:  తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఈనెల 25వ తేదీన అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లి ఎంపీ మైత్రేయన్‌ను వెంటబెట్టుకుని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను కలుసుకునేందుకు వెళ్లారు. అయితే 45 నిమిషాలైనా ఆమె లోనికి పిలవలేదు. ఆ తరువాత ఎంపీ మైత్రేయన్‌ను మాత్రమే లోనికి అనుమతించి ఐదు నిమిషాలు మాట్లాడి పంపేశారు. ప్రధాని మోదీకి సన్నిహితుడైన పన్నీర్‌ సెల్వంతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించడం తమిళనాడులోనే గాక ఢిల్లీ రాజకీయవర్గాల్లో సైతం తీవ్రమైన కలకలం రేపింది. ఆమెను కలవకుండానే పన్నీర్‌ చెన్నైకి చేరుకున్నారు. దీంతో అసలు కారణాలపై అన్వేషణ మొదలై వెలుగుచూసింది.

పన్నీర్‌సెల్వం తమ్ముడు బాలమురుగన్‌ కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య కారణాలతో మదురైలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం అత్యవసరంగా చెన్నైకి తరలించాల్సి న పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్‌లో రోడ్డు మార్గం ద్వారా వస్తే ఆలస్యం అవుతుంది. విమానంలో తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. పన్నీర్‌సెల్వం వెంటనే రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను సంప్రదించగా రక్షణ శాఖకు చెందిన ఏయిర్‌ అంబులెన్స్‌ హెలికాప్టర్‌ను కేటాయించాల్సిందిగా కోరారు. పన్నీర్‌ కోర్కె ఆమె హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు. బెంగళూరులో ఉండిన హెలికాప్టర్‌ ఆఘమేఘాలపై మదురైకి వచ్చింది. రక్షణ శాఖకు చెందిన ఎయిర్‌ అంబులెన్స్‌ హెలికాప్టర్‌ ద్వారా ఈనెల మొదటి వారంలో బాలమురుగన్‌ చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే గోప్యంగా ఉంచాల్సిన ఈ వివరాలన్నీ పన్నీర్‌సెల్వం మీడియా ముందు చెప్పడం నిర్మలా సీతారామన్‌కు ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. ఈ కారణం చేతనే పన్నీర్‌సెల్వంకు మాట్లాడేందుకు ఆమె నిరాకరించిందని తేలింది.

సాధారణ వ్యక్తి అసాధారణ సౌకర్యమా?
ముఖ్యమంత్రి లేదా కేబినెట్‌ హోదా కలిగిన వ్యక్తులకు మాత్రమే వినియోగించాల్సిన అంబులెన్స్‌ హెలికాప్టర్‌ను సాధారణ వ్యక్తికి వినియోగించడం వివాదాస్పదమైంది. అంతేగాక నిర్మలాసీతారామన్‌ తన వ్యక్తిగత పరపతితో రహస్యంగా హెలికాప్టర్‌ను పంపడం మరింత చర్చకు దారితీసింది. రక్షణ శాఖకు సంబంధించినంత వరకు ఇది సీరియస్‌ వ్యవహారమని అంటున్నారు. పైగా మద్యానికి బానిసై అనారోగ్యానికి గురైన వ్యక్తికి ఇంతటి ఉన్నతమైన సేవలు అవసరమా అని విమర్శలు చేస్తున్నారు.

ఇరువూరు రాజీనామా చేయాలి :ప్రతిపక్షాలు
అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్, తమిళనాడుఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తమ పదవులకు రాజీనామా చేయాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. పన్నీర్‌సెల్వం తమ్మునికి  రక్షణశాఖ హెలికాప్టర్‌ పంపడం నిర్మలాసీతారామన్‌ చేసిన మహా తప్పని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గురువారం తిరునెల్వేలిలో వ్యాఖ్యానించారు. నిబంధనలను అతిక్రమించినట్లయితే ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆమెకు ఉందని అన్నారు. ఏయిర్‌ అంబులెన్స్‌ హెలికాప్టర్‌ వివాదానికి నైతిక బాధ్యత వహించి డిప్యూటీ సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా చేయాలని ఆర్కేనగర్‌ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు