యమపురికి రహదారులా?

12 Jun, 2014 00:04 IST|Sakshi
యమపురికి రహదారులా?

రోడ్లు, డ్రైనేజీలు, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం.. ఈ మూడు సమస్యల పరిష్కారానికి ముంబైకర్లు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలింది.  బీఎంసీకి రోడ్ల గురించి 42,287 ఫిర్యాదులు రాగా, డ్రైనేజీలపై 12,708, వ్యర్థాలపై 5,519 ఫిర్యాదులు అందాయి.
 
నగర రోడ్ల దుస్థితిపై ప్రజాగ్రహం

 ముంబై: రాజధాని రోడ్ల దుస్థితిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తేలింది. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికం రోడ్లపైనే ఉన్నాయి. రోడ్ల పేర్లు మార్చడంపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తూ చాలా మంది కార్పొరేటర్లు ఫిర్యాదులు సంధించారు. ప్రజా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. బీఎంసీ రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ఏటా వేలాది మంది మరణిస్తున్ననట్టు ముంబై ట్రాఫిక్‌శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అన్ని రోడ్లు గుంతలమయంగా మారుతుండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణానికి నాణ్యమైన సామగ్రి వాడకపోవడం, పర్యవేక్షణ కొరవడడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

ముంబైకర్లలో అత్యధికులు రోడ్ల దుస్థితిపై ఆందోళనగా ఉన్నారని ఈ సంస్థ వెల్లడించింది. వీటి తర్వాత డ్రైనేజీలు, ఘనవ్యర్థాల నిర్వహణపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. 2013లో బీఎంసీకి రోడ్ల గురించే 42,287 ఫిర్యాదులు రాగా, డ్రైనేజీలపై 12,708, వ్యర్థాలపై 5,519 ఫిర్యాదులు అందాయి. నగరవాసుల్లో ఎక్కువ మందికి ఈ మూడు అంశాలపైనే అభ్యంతరాలు ఉన్నాయని ప్రజా ఫౌండేషన్ ప్రాజెక్టు డెరైక్టర్ మిలింద్ మాస్కే అన్నారు. ఈ సంస్థ గణాంకాల ప్రకారం 2013లో బీఎంసీకి మొత్తం 1,02,829 ఫిర్యాదులు వచ్చాయి. 2012తో పోలిస్తే ఇవి 10.3 శాతం అధికం. ఇక రోడ్ల పరిస్థితిపై వచ్చిన ఫిర్యాదుల సంఖ్య ఏకంగా 41.1 శాతం పెరిగింది.

డ్రైనేజీల ఫిర్యాదుల సంఖ్య 21.4 శాతం అధికమయింది. నీటి సరఫరాపై ఫిర్యాదులు కూడా 2.3 శాతం పెరిగాయి. కేంద్రీకృత ఫిర్యాదుల నమోదు వ్యవస్థ (సీసీఆర్‌ఎస్) గణాంకాలను విశ్లేషించడం ద్వారా ఫౌండేషన్ పైవిషయాలను తెలియజేసింది. రోడ్లు, డ్రైనేజీలు, వ్యర్థాలపై వచ్చిన 65,913 ఫిర్యాదుల్లో బీఎంసీ 44 శాతం ఫిర్యాదులను మాత్రమే పరిష్కరించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) ప్రవేశపెట్టిన పాట్‌హోల్-ట్రాకింగ్ సిస్టమ్ ఆధారిత అండ్రాయిడ్ అప్లికేషన్‌తో ఫిర్యాదులు చేయడం సులువుగా మారిందని మిలింద్ చెప్పారు.
 
‘పాత పద్ధతిలో ఫిర్యాదు చేస్తే.. దాని ప్రస్తుత స్థితితో కూడిన నివేదిక వచ్చేది. ఇప్పుడున్న అండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ఫిర్యాదు చేస్తే ప్రస్తుతం స్థితి (ట్రాకింగ్) తెలియజేయడం లేదు. కాబట్టి ఫిర్యాదులకు సంబంధించిన అన్ని పోర్టళ్లను సీసీఆర్‌ఎస్‌తో అనుసంధానించాలి. దీనివల్ల ట్రాకింగ్ సులువుగా మారడమే గాక, సమస్యలు తెలియజేసేందుకు మరింత మంది ముందుకు వస్తారు’ అని మిలింద్ వివరించారు. బీఎంసీకి చెందిన 227 వార్డుల కార్పొరేటర్లు గత ఏడాది నిర్వహించిన వార్డు సమావేశాల్లో రోడ్ల దుస్థితి గురించి 141 ప్రశ్నలను మాత్రమే అడిగారు. వీటిలో అత్యధికంగా రోడ్లపైనే ఉన్నాయి.
 
సమస్యలు పట్టించుకోని కార్పొరేటర్లు..
గత ఏడాది ఎంసీఎంజీ నిర్వహించిన వార్డు సమావేశాల్లో 19 కార్పొరేటర్లు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. మరో ఏడుగురు కార్పొరేటర్లు అయితే తమ రెండేళ్ల పదవీ కాలంలో ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడం గమనార్హం. వీరిలో అత్యధికులు, స్థానిక సమస్యల పరిష్కారం కంటే రోడ్ల పేర్ల మార్పిడిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ప్రజా ఫౌండేషన్ ట్రస్టీ నీతాయి మెహతా అన్నారు. కార్పొరేటర్లు నిత్యం తమ ప్రాంతాల సమస్యల గురించి తెలుసుకొని పరిష్కారం కోసం బీఎంసీ అధికారులను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. ఫలితంగా వార్డు సమావేశాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని విశ్లేషించారు. ఇదిలా ఉంటే కార్పొరేటర్లు అడిగిన వాటిలో 34 శాతం ప్రశ్నలకు బీఎంసీ నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదని మిలింద్ మాస్కే ఈ సందర్భంగా వివరించారు.

మరిన్ని వార్తలు