‘గ్లాస్‌హౌస్’ను కూల్చేశామని కోర్టుకు చెప్పిన ఎన్‌ఎంఎంసీ

16 Aug, 2013 23:21 IST|Sakshi
 ముంబై: నవీముంబైలోని సిడ్కో ప్లాట్‌లో అక్రమంగా నిర్మించిన ‘గ్లాస్‌హౌస్’ను కూల్చివేశామని నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్(ఎన్‌ఎంఎంసీ) కమిషనర్ శుక్రవారం హైకోర్టుకు తెలిపారు. సిడ్కో నో డెవలప్‌మెంట్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి గణేశ్ నాయక్ అల్లుడు సంతోష్ తాండేల్ బేలాపూర్‌లో ఓ గ్లాస్‌హౌస్‌ను అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై గతంలో స్పందించిన కోర్టు సదరు నిర్మాణాన్ని కూల్చివేయాల్సిందిగా ఎన్‌ఎంఎంసీని ఆదేశించింది. కాగా గ్లాస్ హౌస్‌ను కూల్చివేయడంలో ఎన్‌ఎంఎంసీ విఫలమైందని ఆరోపిస్తూ ఆర్‌టీఐ కార్యకర్త సందీప్ ఠాకూర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలకు ఎన్‌ఎంఎంసీ కమిషనర్ అబాసాహెబ్ లింబాజీ జర్హాద్ సమాధానమిస్తూ.. సదరు బంగ్లాను కూల్చివేశామని, నో డెవలప్ మెంట్ జోన్‌గా ప్రకటించిన స్థలంలో ప్రస్తుతం ఎటువంటి నిర్మాణం లేదని కోర్టుకు తెలిపారు. 
 
 
మరిన్ని వార్తలు