మోడీ ప్రధానిగా మైనారిటీలను ఒప్పిస్తాం

27 Feb, 2014 23:06 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పట్ల ముస్లింలు కూడా సానుకూలత వ్యక్తం చేసి ఎన్నుకునేలా ఒప్పిస్తామని ముంబై మాజీ పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. 2002 గుజరాత్ అల్లర్లలో మోడీ ప్రమేయం లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే క్లీన్‌చిట్ ఇచ్చిందని ఆయన గురువారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  ఒక రాష్ట్రంలో అల్లర్లు జరిగితే దానికి ఒక్క సీఎంనే బాధ్యుడిని చేస్తామా? అధికారులు, మానవ హక్కుల సంస్థల సంగతి ఏంటి? వారికి బాధ్యత ఉండదా అని సింగ్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బీజేపీ ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. జాతీయ ప్రాదేశిక ప్రాంతం(ఎన్‌సీఆర్)లో తప్ప ఆ పార్టీ ఇతర ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు ఉండయన్నారు.

 ప్రజలందరూ ఇప్పుడు మోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ‘ఇప్పటికే 33 ఏళ్ల పాటు పోలీసు విభాగంలో పనిచేశాను. సాధ్యమైనంత మేర న్యాయం చేసేందుకు ప్రయత్నించా. జాతీయ సేవలో భాగస్వామ్యుడిని కావాలనే ఉద్ధేశంతో బీజేపీలో చేరాన’ని తెలిపారు.  బీజేపీ మిత్రపక్షమైన శివసేన రాజకీయలతో ఇప్పటికీ తాను ఏకీభవించనని అన్నారు. ప్రాంతీయ రాజకీయాల్లో ఇష్టం లేదని, జాతీయ రాజకీయాలపైనే దృష్టి కేంద్రీకరిస్తానని వివరించారు. దేశంలో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం విద్యాపై దృష్టి సారిస్తుందని తెలిపారు. ఎవరైనా రాజకీయాల్లో చేరి ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉంటుందని సత్యపాల్ సింగ్ వివరించారు.

మరిన్ని వార్తలు