నేతల ఆశలపై నీళ్లు

14 Apr, 2016 09:33 IST|Sakshi

మంత్రివర్గ ప్రక్షాళనకు బ్రేక్
రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదు
స్పష్టం చేసిన దిగ్విజయ్ సింగ్
 
బెంగళూరు: మంత్రి పదవుల కోసం తహతహలాడుతున్న నేతల ఆశలపై కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ నీళ్లు చల్లారు.  రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేసిన ఆయన..మంత్రి వర్గ ప్రక్షాళనకు బ్రేక్ వేశారు. నగరంలోని కుమారకృపా అతిథి గృహంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండబోదని అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆ పదవి నుండి తప్పించనున్నారన్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు.
 
ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సైతం దిగ్విజయ్ సింగ్ బ్రేక్ వేశారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సిందిగా ఎవరిపైనా ఒత్తిళ్లు లేవని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కాగా, కరువు పరిస్థితుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడంపై దిగ్విజయ్ సింగ్ సీఎం సిద్ధరామయ్యపై ఫైర్ అయినట్లు సమాచారం. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు తాండవమాడుతున్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణతో పాటు అంతర్గత కుమ్ములాటలను పక్కకు పెట్టి ప్రజలకు సమాయం అందించే దిశగా ప్రణాళికలు రచించాలని దిగ్విజయ్ సింగ్  సిద్ధరామయ్యకు సూచించారు. ఆ దిశగా ఎమ్మెల్యేలకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.
 
 హైకమాండ్‌కు ఫిర్యాదు చేయమనండి.....
 కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ స్థానం నుండి దిగ్విజయ్ సింగ్‌ను తప్పించాలంటూ ఆ పార్టీ సీనియర్ నేత హెచ్.విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలపై దిగ్విజయ్ స్పందించారు. ‘విశ్వనాథ్ పై నాకు గౌరవం ఉంది. నేను అసమర్ధుడిని అని విశ్వనాథ్ భావిస్తే ఈ విషయంపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేయమనండి. విశ్వనాథ్ ఎలాగో సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ఫిర్యాదు చేస్తే హైకమాండ్ నన్ను ఈ బాధ్యతల నుండి తప్పించవచ్చేమో’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు