‘మేజిక్’ కోసం ప్రయత్నాలు

24 Apr, 2015 22:30 IST|Sakshi

- ఎన్‌ఎంసీ పీఠం రేసులో ముందున్న ఎన్సీపీ
- మేజిక్ ఫిగర్ 56కు మరో 4 స్థానాలు అవసరం
- కాంగ్రెస్ మద్దతు లేకుండానే అధికారం చేపట్టేందుకు సిద్ధం
- ఇంకా రేసులో ఉన్న బీజేపీ-సేన కూటమి
సాక్షి,ముంబై:
నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అధికార పీఠం దక్కించుకునేందుకు పార్టీలన్నీ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇరు కార్పొరేషన్‌లలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), శివసేన-బీజేపీ కూటమి మేజిక్ ఫిగర్‌కు దగ్గరలో ఉన్నాయి. దీంతో స్వతంత్రులు లేదా చిన్న పార్టీల అండతో అధికారం ఏర్పాటు చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. నవీముంబైలో ఉన్న 111 వార్డుల్లో అధికారం చేజిక్కించుకోవాలంటే మేజిక్ ఫిగర్ 56 స్థానాలు దక్కాలి.

ఇందులో శివసేన నుంచి 38 మంది, మిత్రపక్షమైన బీజేపీ నుంచి ఆరుగురు కలిపి మొత్తం 42 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. 52 మంది కార్పొరేటర్ల గెలుపు ద్వారా ఎన్సీపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ అధికారం ఏర్పాటు చేయాలంటే కాషాయ కూటమి కంటే ఎన్సీపీకే ఎక్కువ అవకాశాలున్నాయి. కాగా, తమకు ఐదుగురు కార్పొరేటర్ల మద్దతు ఉందని, కాంగ్సెస్ సాయం అవసరం లేదని ఫలితాల అనంతరం ఎన్సీపీ ప్రకటించింది. శివసేన సీట్లు తగ్గిపోవడానికి ప్రధాన కారణం బీజేపీతో పొత్తు పెట్టుకోవడమేనని విశ్లేకులు చెబుతున్నారు. బీజేపీతో కలిసి పోటీచేస్తున్నట్లు తెలియగానే శివసేనకు చెందిన 41 మంది పార్టీపై తిరుగుబాటు చేశారు. శివసేన పోటీచేస్తున్న వార్డుల్లో వీరు కూడా బరిలో నిలచి ఓట్లు చీలిపోవడానికి కారకులయ్యారు. సేన నుంచి ఇద్దరు, ఎన్సీపీ నుంచి ఒకరు మాత్రమే తిరుబాటు అభ్యర్థులు గెలిచినా.. వీరి కారణంగా ఎన్సీపీనే ఎక్కువ శాతం లాభపడింది.

ఒకే కుటుంబంలో గెలుపోటములు..
రాజకీయాల్లో గెలుపు కోసం నాయకులు ఎంతటికైనా తెగిస్తారనేది జగమెరిగిన సత్యం. ఈ విషయం తాజా ఎన్నికల్లో మరోసారి రుజువైంది. అధికారం కోసం రెండు కుటుంబాల మధ్య కలహాలు సృష్టించడానికైనా నేతలు వెనకాడరు. ఒకే కుటుంబ సభ్యులకు వేర్వేరు పార్టీలు టికెటు ఇచ్చి బరిలో నిలిపాయి. నవీముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఏడు జంటలు (భార్యాభర్తలు) వేర్వేరు పార్టీల టికెట్లపై పోటీ చేసి కార్పొరేటర్లయ్యాయి. చౌగులే, మడ్వీ కుటుంబాలకు చెందిన తండ్రీకొడుకులు కార్పొరేటర్లు అయ్యారు.

భగత్ అనే వ్యక్తి కుటుంబం నుంచి ముగ్గురు మహిళలు కార్పొరేటర్లుగా గెలిచారు. వార్డు నంబరు 75లో బరిలో దిగిన అభ్యర్థులందరినీ ఓటర్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎవరు కూడా నన్ ఆఫ్ అబౌ (నోటా) నొక్కలేదు. మిగత 100 వార్డుల్లో ఇద్దరు, ముగ్గురు నోటా నొక్కిగా, 16వ వార్డులో 116 మంది నోటా వినియోగించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలులోకి వచ్చిన తరువాత ఇక్కడ ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. లెక్క ప్రకారం చూస్తే నవీముంబైలో 56 మంది మహిళ కార్పొరేటర్లు ఎన్నికవాలి. అయితే ఓపెన్ కేటగిరి నుంచి బరిలో దిగిన కొందరు మహిళల్లో నలుగురు గెలుపొందడంతో మహిళకార్పొరేటర్ల సంఖ్య 60కి చేరింది.

పెరిగిన బలాబలాలు..
గతంలో నవీముంబై కార్పొరేషన్‌లో ఎన్సీపీకి-54, శివసేన-17, కాంగ్రెస్-13, బీజేపీ-1, స్వతంత్రులు-4 గెలిచారు. కాని ఈ ఎన్నికల్లో ఎన్సీపీకి రెండు స్థానాలు తగ్గగా, శివసేనకు ఏకంగా 21 స్థానాలు పెరిగాయి. కాంగ్రెస్‌కు మూడు స్థానాలు తగ్గగా, బీజేపీకి ఐదు స్థానాలు పెరిగాయి.

మరిన్ని వార్తలు