రెండో రోజు కూడా విలేకరులకు నో ఎంట్రీ

18 Feb, 2015 23:05 IST|Sakshi

న్యూఢిల్లీ: సచివాలయం వద్ద విలేకరులకు రెండోరోజు కూడా చేదు అనుభవమే ఎదురైంది. అర్వింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ప్రభుత్వం సచివాలంలోకి రాకుండా వరుసగా రెండోరోజు మంగళవారం కూడా అడ్డుకోవడంపట్ల విలేకరులు అసహనం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వానికి మొదటి పనిదినమైన సోమవారం కూడా సచివాలయంలోకి రాకుండా కొంతమంది విలేకరులు, టీవీ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

దీనిపై సచివాలయం భద్రతా విభాగం అధికారి ఒకరు మాట్లాడుతూ మీడియా ప్రతినిధులను లోపలికి రానివ్వద్దంటూ ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు అందాయన్నారు. అయితే ఇందుకు  సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. రెండు రోజులుగా సచివాలయం వద్ద ఎదురవుతున్న చేదు అనుభవంతో ప్రభుత్వ వైఖరిపై విలేకరులు మండిపడుతున్నారు. ‘సోమవారం సచివాలయంలోనికి రాకుండా అడ్డుకున్నారు. మంగళవారం రోజున లోపలికి అనుమతించవచ్చని ఆశించాం, కానీ ఈ మూర్ఖపు ప్రభుత్వం ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తించింది’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని విలేకరి ఒకరు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు