ఎలాంటి తొందరపాటు లేదు

2 May, 2014 23:47 IST|Sakshi
ఎలాంటి తొందరపాటు లేదు

 ఆప్ గుర్తింపు విషయంపై హైకోర్టుకు ఈసీ వివరణ
 న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి గుర్తింపు విషయంలో తాము ఏమాత్రం తొందరపడలేదని ఢిల్లీ హైకోర్టుకు ఎన్నికల కమిషన్ తెలిపింది. కావలసిన దస్తావేజులన్నీ సమర్పించిన తరువాతే గుర్తింపు పక్రియ పూర్తి చేశామని చీఫ్ జస్టిస్ జీ రోహిణీ నేతృత్వ్యంలోని బెంచ్‌కు అందించిన అఫిడవిట్‌లో పేర్కొంది. నకిలీ, కల్పిత పత్రాలు సమర్పించి గుర్తింపు పొందిన అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్‌ఆద్మీపార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనవ్యాజ్యంపై స్పందించిన కోర్టు ఈసీ వివరణ కోరింది.

 

అవసరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసిన తరువాతే ఆమ్ ఆద్మీ పార్టీకి గుర్తింపు నిచామని ఈసీ ఆ అఫిడవిట్‌లో తెలిపింది. అర్జీదారు హంసరాజ్ జైన్ ఆప్‌పైన ఆరోపణలు చేశాడని, కానీ కేసులో కక్షిదారుగా పార్టీని పొందుపరచలేదని ఈసీ తెలిపింది. ఎలాంటి చట్ట  ఉల్లంఘనలు, వివాదాలు లేనందున కేసును కొట్టి వేయాలని ఈసీ కోర్టును కోరింది. అయితే తదుపరి విచారణ జరిగే జూలై 30 వరకు అఫిడవిట్‌ను రిజిస్ట్రీలో అందుబాటులో ఉంచాలని కోర్టు ఈసీని ఆదేశించింది.

మరిన్ని వార్తలు