మల్కన్‌గిరిలో ఎనీటైం ఖాళీ..!

8 Jan, 2020 13:15 IST|Sakshi
మూతపడిన ఇండియన్‌ బ్యాంక్‌ ఏటీఎం

జిల్లా కేంద్రంలో మూతకు గురైన ఏటీఎంలు

డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఇక్కట్లు పడుతున్న ప్రజలు

ఒడిశా, మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలోని ఏ ఏటీఎంలో చూసినా డబ్బులు లేని పరిస్థితి. దీంతో డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్‌కు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో అవసరమై డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంకు వస్తే అందులో డబ్బులు లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని, ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా పేరొందిన స్టేట్‌బ్యాంక్‌ ఏటీఎంలో డబ్బులు లేకపోవడం విశేషం. ఇదే విషయంపై ఆ బ్యాంక్‌ మేనేజర్‌ను కలిసినా ఫలితం కనిపించలేదని ఆ బ్యాంక్‌ ఖాతాదారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో మొత్తం 23 సెంటర్లలో వివిధ బ్యాంకులకు చెందిన 23 ఏటీఎంలు ఉండగా, ఏ ఒక్క ఏటీఎం తెరిచి ఉండకపోవడం గమనార్హం.

ఈ క్రమంలో ప్రజలు తమ అవసరాలు తీర్చుకునేందుకు ఇక్కట్లు పడుతుండగా తమ ఖాతాలో డబ్బులున్నా అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడిప్పుడే జిల్లాలోని గిరిజనులు కూడా ఏటీఎంల వాడకం ప్రారంభించగా, ప్రస్తుతం ఏటీఎంలో డబ్బులు లేకపోవడంతో వారు తమ అవసరాల నిమిత్తం డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుస్తోంది. ఇదే విషయంపై ఆయా బ్యాంకుల యజమానులను కలిసినా ఫలితం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి, డబ్బులు ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు