రాజకీయ నిష్ర్కమణ ఉండబోదు

13 Mar, 2016 03:20 IST|Sakshi
రాజకీయ నిష్ర్కమణ ఉండబోదు

మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ

 

సాక్షి, బెంగళూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, అదే సందర్భంలో రాజకీయాల నుంచి నిష్ర్కమణ ఉండబోదని జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ పేర్కొన్నారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసేది అధికారం కోసమని, అయితే రాజకీయాల్లో తాను కొనసాగాలనుకుంటున్నది మాత్రం పార్టీని పటిష్టం చేసుకొనేందుకు అని దేవెగౌడ తెలిపారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఆ సమయంలో రాష్ట్ర ప్రజలు ఏ తీర్పు చెబుతారన్న ఇప్పుడే అంచనా వేయలేమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి సైతం 2018లో పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా దేవేగౌడ గుర్తు చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో హెచ్.డి.కుమారస్వామి సారధ్యంలో జేడీఎస్ పార్టీ ఎలాంటి పొత్తులు లేకుండానే 40స్థానాలు సాధించిందని, ఇదే సందర్భంలో ఓ జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకోగలిగిందే మీకు తెలిసిందే కదా! అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మహదాయి నదీజలాల పోరాటం, ఎత్తినహొళె అమలుకోసం జరుగుతున్న ఉద్యమాలను చూస్తుంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఓ ప్రాంతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉందన్న విషయం అర్థమవుతోందని అన్నారు. కళసా బండూరి పథకం అమలు కోసం ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని   కోరినా ఆయన స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. రానున్న ఐదురాష్ట్రాల ఎన్నికల్లో సైతం జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల పొత్తుతోనే ఎన్నికల బరిలో దిగనున్నాయని హెచ్.డి.దేవేగౌడ తెలిపారు. 

మరిన్ని వార్తలు