నో పాలిటిక్స్, రజనీ మంచి వ్యక్తి..

29 Jan, 2016 09:30 IST|Sakshi
నో పాలిటిక్స్, రజనీ మంచి వ్యక్తి..

సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పద్మ విభూషణ్ అవార్డు ప్రదానంలో ఎలాంటి రాజకీయం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. ఆయన మంచి మనిషి అని కితాబు ఇచ్చారు. కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోదీ, రజినీకాంత్ మధ్య సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. దీన్ని ఆసరాగా తీసుకుని దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్  రజనీకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు కమలనాథులు తీవ్ర కుస్తీలు చేస్తూ వస్తున్నారు. అయితే తలైవా ఎక్కడా చిక్కకుండా తన మార్గంలో తాను సాగుతూ ఉన్నారు.
 
 ఈ సమయంలో రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని ఆయనకు పద్మవిభూషణ్‌ను కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డు రజనీకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు సాగుతున్న గాలంలో భాగం అన్నట్టుగా తమిళ  మీడియాల్లో కథనాలు బయల్దేరాయి. అయితే ఈ కథనాలను ఖండిస్తూ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తీవ్రంగా స్పందించారు. కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు గురువారం జవదేకర్ వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయన్ను మీడియా చుట్టుముట్టింది. ఇటీవల తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చి మరణించిన వ్యవహారంపై ప్రశ్నల్ని గుప్పించారు.
 
ఇందుకు స్పందిస్తూ పరిశోధనలు సాగుతున్నాయని, ఆ మేరకు తదుపరి చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌కు పద్మ విభూషణ్ ప్రస్తావన తీసుకు రాగా, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు అని స్పష్టం చేశారు. రాజకీయ ఉద్దేశంతోనూ ఈ అవార్డు ఆయనకు ఇవ్వలేదు అని, ఆయనకు ఇవ్వడం ద్వారా ఆ అవార్డుకు మరింత గౌరవాన్ని కల్గించామన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దు అని సూచించారు. రజనీకాంత్ గొప్ప నటుడే కాదు అని, మంచి మనిషి కూడా అని కితాబు ఇచ్చారు. ఏ తరం వాళ్లకైనా సరే ఆయన అంటే ఎంతో ఇష్టం అని, ఆయన స్టైల్ రాబోయే తరం వారికి కూడా నచ్చుతుందని వ్యాఖ్యానించారు. అందుకే ఆ అవార్డు ఆయనకు సొంతమైందన్నారు.
 
మోదీ పర్యటన ఏర్పాట్ల పరిశీలన: ప్రధాని నరేంద్ర మోదీ కోయంబత్తూరు ఏర్పాట్లను జవదేకర్ పరిశీలించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి ఆవరణలో సాగుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో సమాలోచించారు. ఒడిస్సియా మైదానంలో జరగనున్న భారీ బహిరంగ  సభ ఏర్పాట్లను సైతం పరిశీలించారు. ఆయనతో పాటుగా కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ కూడా ఈ పరిశీలనలో ఉన్నారు. పది లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా ఈ బహిరంగ సభ ఉంటుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు వేగవంతం చేశామని పొన్ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఒక్క కోయంబత్తూరు నుంచి మాత్రం లక్ష మంది ఈ సభకు రానున్నారని, ఈ సభ రాష్ట్ర రాజకీయ మార్పులకు వేదిక కానున్నదన్నారు. రెండో తేదీ ఇక్కడకు రానున్న మోదీని పలువురు మిత్రులు కలవడం ఖాయమని, ఇందులో అనేక పార్టీల నాయకులు సైతం ఉన్నారని వ్యాఖ్యానించారు.
 

>
మరిన్ని వార్తలు