ఏమీ సేతుర లింగా ఏమీ సేతూ..

12 Dec, 2016 15:19 IST|Sakshi
ఏమీ సేతుర లింగా ఏమీ సేతూ..

బ్యాంకుల మూతతో బేజారు
రెండు రోజుల సెలవులతో సతమతం

బ్యాంకుల గేట్లకు తాళాలు, ఏటీఎంలపై నో క్యాష్ బోర్డుల తోరణాలతో బిక్కచచ్చిపోరుున ప్రజలు ‘ఏమీ సేతుర లింగా ఏమీ సేతూ’ అంటూ పాడుకుంటున్నారు. బ్యాంకులకు శని, ఆదివారాల సెలవుతో ఖాతాదారులు సతమతమైపోతున్నారు. ఆశగా ఏటీఎంల వైపు వెళితే డబ్బులు లేని ఆ డబ్బాతో నిరాశే మిగులుతోంది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: పెద్ద నోట్ల రద్దు పేద, మధ్యతరగతి ప్రజలనే ఎక్కువగా బాధిస్తున్నదని గట్టిగా చెప్పవచ్చు. నగదు కోసం 16 రోజులుగా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. పాత నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్త నోట్లతో ఆదుకోవడంలో విఫలమైంది. రూ.2వేల నోట్లను మాత్రమే ముందుగా విడుదల చేసి చిన్ననోట్లపై చిన్నచూపు చూసింది. రూ.24వేల వరకు డ్రా చేసుకోవచ్చని కేంద్రం చెబుతున్నా కరెన్సీ లేని కారణంగా కొంత మొత్తాన్ని మాత్రమే కొసరి కొసరి సర్దుతున్నారు. రూ.100, రూ.500 కరెన్సీ చిల్లర నోట్లు కావాలంటూ ప్రజలు చిటపటలాడుతున్నారు. ఈ దశలో శుక్రవారం చెన్నైకి చేరుకున్న 14 టన్నుల రూ.500 నోట్లు ఎంత వరకు ప్రజలకు అందుబాటులోకి వస్తాయోననే అనుమానాలు నెలకొన్నారుు. 28వ తేదీకి అన్ని  ఏటీఎంల నుంచి రూ.500 నోట్లను పొందవచ్చని బ్యాంకు అధికారుల చెబుతున్నారు.

ఈ 14వేల టన్నుల్లో ఏ బ్యాంకు ఎంత వాటా దక్కుతుందోననే అనుమానాలు నెలకొని ఉన్నారుు. చెన్నైలోని రిజర్వు బ్యాంకు ఆధీనంలోని ఈ సొమ్ము పంపిణీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కే సింహభాగం దక్కే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్లుగా రాష్ట్రంలోని ఏటీఎంలలో రూ.500 నోట్లు అందుబాటులోకి వస్తాయని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఇటీవల కోవైలో ప్రకటించడం గమనార్హం. ఏటీఎంల రంగ ప్రవేశం వల్ల నగదు డ్రా కోసం బ్యాంకులపై ఆధారపడే రోజులు ఏనాడో పోయారుు. పెద్ద నోట్ల రద్దుతో మళ్లీ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదు. శని, ఆదివారాలను దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల నిండా సొమ్ము పెట్టి ఉంటారని అందరూ ఆశించగా అది నిరాశే అని తేలేందుకు పెద్దగా సమయం పట్టలేదు.

నగదున్న ఏటీఎం కోసం వేటాడి వెంటాడిన ఖాతాదారులు వాటి ముందే కూలపడిపోవడం చూపరుల గుండెను ద్రవింపజేసింది. అతికొద్ది ఏటీఎంలలో మాత్రమే నగదు ఉండడంతో చాంతాడంత క్యూ తయారైంది. గంటల తరబడి క్యూలో నిల్చుని ఏటీఎం వద్దకు వచ్చి కార్డు పెట్టగానే డబ్బులేదనే సమాచారం దర్శనమిస్తోంది. కొన్ని బ్యాంకులు ముందుగానే నో క్యాష్ బోర్డు పెట్టేశారుు. ఏటీఎంలలో డబ్బు లేనపుడు నింపాలిగానీ బోర్డు పెట్టడం ఏమిటని విమర్శిస్తున్నారు. పాత నోట్ల ద్వారా పన్నులు చెల్లించవచ్చని చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది.

28న సామూహిక ఆందోళనలు : కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు ఈనెల 28వ తేదీన సామూహిక ఆందోళనలు సాగనున్నారుు. నిరసన ప్రదర్శనలు చేస్తున్నట్లు డీఎంకే, వామపక్షాలు వేర్వేరుగా గతంలో ప్రకటించి ఉన్నారుు. డీఎంకే ఆందోళనలో తాము పాల్గొంటున్నట్లు తమిళ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాణిజ్య సంఘాలు సైతం నిరసన తెలుపబోతున్నట్లు శనివారం ప్రకటించారుు. ఈ  సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల దుకాణాలను మూసివేయనున్నారు.

మరిన్ని వార్తలు