తమ్మిలేరుపై నీలినీడలు

25 Feb, 2017 18:46 IST|Sakshi

తమ్మిలేరు జలాశయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సర్కారు నిర్లక్ష్యం శాపంగా మారింది. ఫలితంగా  జిల్లాతోపాటు కృష్ణాజిల్లాలోని 30వేల ఎకరాలకుపైగా ఆయకట్టు భవిత ప్రశ్నార్థకంగా మారింది.
చింతలపూడి : తమ్మిలేరు రిజర్వాయర్‌ నిర్మించి 40 ఏళ్లు పూర్తయినా ఇప్పటివరకూ పూర్తిస్థాయి మరమ్మతులకు నోచుకోలేదు. 1996 తర్వాత ఈ ప్రాజెక్టు అభివృద్ధి అంశం మరుగున పడింది. కనీసం ఈసారి బడ్జెట్‌లోనైనా దీని అభివృద్ధికి నిధులు కేటాయించాలనే డిమాండ్‌ రైతుల నుంచి వ్యక్తమవుతోంది.

అన్నీ సమస్యలే: ప్రస్తుతం రిజర్వాయర్‌ గట్టు బలహీనంగా ఉంది. గట్టుపైకి చేరుకునే మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. రివిట్‌మెంట్‌ కూడా అంతంత మాత్రంగా ఉంది. సాగునీరు అందించే పంట కాలువలూ దెబ్బతిన్నాయి. రిజర్వాయర్‌ కుడి కాలువ 6.508 కిలోమీటర్లు, ఎడమకాలువ 10.185 కిలోమీటర్లు, మంకొల్లు కాలువ పొడవు 3.38 కిలోమీటర్లు. వీటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ జలాశయం వద్ద కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ 6.4 కిమీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 74 మీటర్ల ఎత్తులో మట్టికట్టను నిర్మించారు.
ఎంతగా కృషి చేసినా..!: తమ్మిలేరు అభివృద్ధి కోసం 2006లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వం ఎంతగా కృషి చేసినా ఫలితం దక్కలేదు. అప్పట్లో ఇరిగేషన్‌ అధికారులు రూ.24కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆ తరువాత జపాన్‌కు చెందిన ఇంటర్‌నేషనల్‌ కో–ఆపరేటివ్‌ ఎయిడ్‌ (జేఐసీఏ) అనే సంస్థ నిధులతో తమ్మిలేరు మరమ్మతులు చేపట్టారు. అయితే అన్ని అనుమతులు వచ్చాక నిధుల విడుదలకు నిర్దేశించిన గడువు పూర్తి కావడంతో మరమ్మతులు నిలిచిపోయాయి.  దీంతో  తిరిగి నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దీనికి కేంద్ర జలసంఘం అనుమతులు లభించి నిధులు మంజూరు కోసం ఎదురు చూస్తున్న సమయంలో రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, గత ఏడాది రాష్ట్ర విభజన కూడా జరిగిపోవడంతో ఈ నిధులపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది.
విభజన శాపం: రాష్ట్రంలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన తమ్మిలేరుకు రాష్ట్ర విభజన శాపంగా మారింది. విభజన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ ప్రాజెక్టు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లకపోవడంతో విభజన చట్టంలో దానికి చోటు దక్కలేదు.  విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం తమ్మిలేరుకు వచ్చే నీటిని నిలిపి వేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మెట్ట రైతుల కల్పతరువైన ఈ రిజర్వాయర్‌కు శాశ్వత సాగునీరు ఎండమావిలా మారింది.
పరిశీలనతో సరి!: రాష్ట్ర విభజన అనంతరం తమ్మిలేరు ప్రాజెక్టును అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా గుర్తించడంతోపాటు అంతర్రాష్ట్ర కోటాలో అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ దశలో గత ఏడాది ఫిబ్రవరిలో జపాన్‌ బృందం ప్రాజెక్టును పరిశీలించి వెళ్లింది. ఆ తర్వాత సర్కారు పట్టించుకోకపోవడంతో జపాన్‌ నిధులు వచ్చేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది.  
ఇందిరాసాగర్‌ ఆశలు ఆవిరేనా!: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 2005లో మంజూరు చేసిన ఇందిరాసాగర్‌ ఎత్తిపోతల పథకం ఆశలు ప్రస్తుతం ఆవిరైనట్టే కనిపిస్తోంది.   గోదావరి జలాలను మెట్ట ప్రాంతంలోని తమ్మిలేరు ప్రాజెక్టుతోపాటు, చెరువుల్లోకి మళ్లించి 36 వేల ఎకరాలకు నీరు అందించడానికి ఖమ్మం జిల్లా , అశ్వారావుపేట మండలం రుద్రమకోట వద్ద ఇందిరాసాగర్‌ ఎత్తిపోతల ప«థకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ ఆకస్మిక మరణం తర్వాత ప్రభుత్వం ఈ పథకానికి నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశాక విభజన అనంతరం ప్రాజెక్టు ప్రాంతం ఆంధ్రాలోనూ, కాల్వలు తెలంగాణ భూ భాగంలోకి వెళ్లడంతో ప్రాజెక్టును  ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు  పట్టించుకోవడం మానేశాయి. దీంతో ఈ ప్రాజెక్టు కోసం కొన్న భారీ పైపులు, మోటార్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి.  

చింతలపూడి ఎత్తిపోతలే శరణ్యం: తమ్మిలేరు ప్రాజెక్టుకు పూర్వ వైభవం రావాలంటే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి తమ్మిలేరుకు గోదావరి జలాలను మళ్లించాలి. నా హయాంలోనే వైఎస్సార్‌ ఇందిరా సాగర్‌ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ పథకం తెలంగాణలో ఉండటంతో నీరు వచ్చే అవకాశాలు తక్కువ. చింతలపూడి పథకం ఒక్కటే మెట్ట రైతులకు శరణ్యం.

ఘంటా మురళీరామకృష్ణ, మాజీ శాసన సభ్యులు, చింతలపూడి

ఈసారి నిధులు వస్తాయి తమ్మిలేరు ప్రాజెక్టు అభివృద్ధికి ఈ సారి తప్పకుండా నిధులు మంజూరు అవుతాయి. ప్రభుత్వం జపాన్‌ బృందంతో చర్చలు జరుపుతోంది. జిల్లాకు చెందిన ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు ఇటీవల ఢిల్లీ వెళ్ళి నిధుల కోసం యత్నాలు  చేశారు.
ఎం.అప్పారావు, ఇరిగేషన్‌ డీఈ , తమ్మిలేరు

మరిన్ని వార్తలు