సియాలియా.. మరో శని సింగనాపూర్‌..!

24 Dec, 2019 13:02 IST|Sakshi
తలుపుల్లేని ఇళ్లు

తలుపుల్లేని గ్రామంగా ప్రసిద్ధి చెందిన సయాలియా  

ఆ గ్రామంలో దొంగతనం, దోపిడీ కేసులు శూన్యం

గ్రామదేవతపై నమ్మకంతో స్థానికుల చర్యలు

పర్యాటక కేంద్రంగా చేసేందుకు అధికారుల సన్నాహాలు

ఒడిశా ,భువనేశ్వర్‌: తలుపులు లేని ఇళ్లు ఉండే ఊరు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది మహారాష్ట్రలోని షిర్డీ దగ్గరలో ఉన్న శని సింగనా పూర్‌. ఇటువంటి గ్రామ మే సరిగ్గా ఒడిశా రాష్ట్రంలో కూడా ఉంది. ఇదే కేంద్రాపడా కోస్తా జిల్లా రాజకనికా సమితిలోని సియాలియా. ఈ గ్రామంలో ఏ ఇంటికీ తలుపులు ఉండవు.

ప్రవేశ ద్వారాలు మాత్రమే ఉంటాయి. ఇళ్ల నిర్మాణం ప్రారంభం నుంచే ఈ విధంగా నిర్మాణ శైలి కొనసాగుతుంది. ఇక్కడి గ్రామ దేవతపై ఉన్న నమ్మకంతో ఇళ్లకు తలుపులు, తాళాలు వేయించుకోమని గ్రామస్తుల గట్టి నమ్మకం. దాదాపు 1,200 మంది ఈ గ్రామంలో నివశిస్తున్నారు. అక్కడి మా ఖొరాఖాయి సియాలియా గ్రామదేవత. ఎండవానల్లో బహిరంగ పీఠంపై పూజలందుకునే దేవతను ఖొరాఖాయిగా వ్యవహరిస్తారు. సియాలియా గ్రామదేవత పూజా ప్రాంగణం కూడా తలుపులు లేకుండానే ఉంటుంది. గ్రామంలో దొంగతనానికి పాల్పడినా, ఇళ్లకు తలుపులు అమర్చినా ఖొరాఖాయి అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదంట. ఈ నేపథ్యంలో పలు కథనాలు కూడా స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి. రాజ్‌కనికా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఈ సియాలియా గ్రామం ఉండగా, ఇదే గ్రామం నుంచి ఇప్పటివరకు దొంగతనాలు, దోపిడీలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు చరిత్రలో లేదు.

సియాలియా గ్రామదేవత
మూఢనమ్మకం..
తలుపులు లేకుండా ఇళ్ల నిర్మాణం వ్యవస్థ పట్ల అక్కడక్కడ విముఖత వ్యక్తమవుతోంది. గ్రామ ఆచారం ఉల్లంఘనకు పాల్పడితే గ్రామ దేవత ఆగ్రహానికి గురికావడం తప్పదనే కథనాలు సంస్కరణకు కళ్లెం వేస్తున్నాయి. లోగడ గ్రామస్తుడు ఇంటికి తలుపులు బిగించడంతో కొద్దికాలంలోనే ఆ ఇల్లు అగ్నిప్రమాదానికి గురైందని, ఇదే గ్రామ దేవత ఆగ్రహానికి నిదర్శనమని స్థానికుల వాదన. అది మొదలుకుని గ్రామదేవతపై భారం వేసిన గ్రామస్తులు ఎవ్వరూ తమ ఇంటికి తలుపులు బిగించకపోవడం గమనార్హం.

గోప్యతకు అడ్డంకి..
గ్రామంలోని కుటుంబ జీవనంలో గోప్యతకు ఇది అడ్డంకి మారి చాలా ఇబ్బందికరంగా ఉంది. వివాహం పురస్కరించుకుని, ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసే కోడళ్లకు తలుపులు లేని ఇళ్లల్లో కాపురం చేయడం ఎలా అర్థం కాని పరిస్థితి. గోప్యతకు తావు లేకుండా ఉన్న ఇంటిలో కాపురం చేయడం పట్ల అసహనం కొత్తగా వచ్చే కోడళ్లు ఆశ్చర్యపడుతూ అసహనం వ్యక్త చేస్తున్నారు. మరో వైపు గ్రామ దేవత ఆగ్రహం పట్ల ప్రచారంలో ఉన్న పలు కథనాలు కొత్త కోడళ్లకు దిక్కుతోచని పరిస్థితిల్లోకి నెట్టివేశాయి. వర్ధమాన కాలమాన పరిస్థితుల్లో సామాజిక జీవన స్రవంతితో సర్దుబాటు కోసం తలుపులు లేని ద్వార బందాలకు మొక్కుబడి తెరదించి ఇప్పుడు పబ్బం గడుపుతున్నారు. క్రమంగా కొత్త కోడళ్లకు గ్రామ ఆచారం అలవాటు అయ్యేలా పెద్దలు చూస్తున్నారు. ఇప్పటికీ ఆ గ్రామ సంస్కారానికి వారధులుగా సియాలియా గ్రామ పెద్దలు ఉన్నారు.

ఎన్నో కథనాలు..
కలపతో తయారు చేసిన తలుపు మీద తేలియాడుతూ ఒక విగ్రహం గ్రామంలో నదీ తీరానికి చేరింది. ఈ విగ్రహాన్ని గ్రామం శివారుకు తరలించి గ్రామ దేవతగా కొలుస్తున్నారు. నీటిలో తేలియాడుతూ గ్రామం చేరిన దేవతకు ఎండవానలు లేక్కేమిటనే నినాదంతో బహిరంగ వేదికపై నిత్య పూజార్చనలు నిరవధికంగా కొనసాగించడంతో ఆ దేవతను ఖొరాఖియాగా స్థానికులు పేర్కొంటారు. కలప తలుపునే వాహనంగా చేసుకుని గ్రామానికి విచ్చేసిన దేవత పట్ల భక్తిపరమైన గౌరవ భావంతో సియాలియా గ్రామస్తులు ఇళ్లకు తలుపులు ఏర్పాటు చేయరని మరో కథనం. ఇళ్లల్లో ఉండే బీరువాలకు ఇకపై నుంచి తాళాలు కూడా వేయరని గ్రామస్తులు చెబుతుంటారు.

ఉచ్ఛారణ లోపం..
ఉచ్ఛారణ లోపంతో గ్రామం పేరు సియాలియాగా మారిందని ఓ వర్గం విచారం వ్యక్తం చేస్తోంది. నదిలో కలప తలుపుపై తేలియాడుతూ తీరం చేరిన గ్రామదేవత ఎదురుగా శవాన్ని కుక్క, నక్క చీల్చుతున్నట్లు తారసపడింది. ఈ సన్నివేశం దృష్ట్యా ఆ గ్రామానికి శైవాలయ లేదా శవాలయ అని నామకరణం చేశారు. కాలక్రమంలో వాడుకలో ఆ గ్రామం పేరు సియాలియాగా స్థిరపడిపోయిందని ఆ వర్గం చెబుతోంది.

మరిన్ని వార్తలు