తాగునీటి సమస్యకు టాటా

1 Feb, 2014 23:28 IST|Sakshi
తాగునీటి సమస్యకు టాటా

 సమగ్ర ప్రణాళికను రూపొందించిన
 జిల్లా పరిషత్‌నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న అధికారులు
 
 పుణే: తాగునీటి కొరత సమస్యను అధిగమించేందుకు జిల్లా పరిషత్ చొరవ తీసుకుంది. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమైంది, తాగునీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సమగ్ర ప్రణాళిక అమలుకోసం రూ. 90 కోట్లను వెచ్చించాలని జిల్లా పరిషత్ అధికారులు నిర్ణయించారు. కొరత ఉన్న ప్రాంతాల్లో నీటి లభ్యతపై అధికారులు దృష్టి సారించనున్నారు. నిపుణుల సలహాలు, సూచనలమేరకు ప్రణాళికను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. నీటి కొరత సమస్యను శాశ్వత ప్రాతిపదికపై అధిగమించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అదేవిధంగా తాత్కాలికంగా ఈ సవాలును అధిగమించడంపై దృష్టి సారించామన్నారు. ఇందుకోసం కొన్ని కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించామన్నారు. కొత్త ప్రణాళికలో మరికొన్నింటిని చేర్చి వాటినికూడా అమలు చేస్తామన్నారు.
 
 కొరత తీవ్రంగా ఉంది
 జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నీటి కొరత సమస్య తీవ్రంగా ఉందని జిల్లా పరిషత్‌కు చెందిన ఓ ప్రతినిధి పేర్కొన్నారు. జిల్లా గత అనేక సంవత్సరాలుగా నీటి కొరత సమస్యను ఎదుర్కొంటోందన్నారు. జిల్లాలోని దాదాపు 500 గ్రామాల ప్రజలు తమ నిత్యావసరాల కోసం వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారన్నారు. నీటి కొరత సమస్య ఎదుర్కొంటున్న ఆయా గ్రామాల ప్రజల కోసం జిల్లా అధికార యంత్రాంగం మొత్తం 1,000 ట్యాంకర్లను వినియోగిస్తోందన్నారు. కొరత సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాన నీటి సంరక్షణకు జిల్లా అధికార యంత్రాంగం అనేక చర్యలు తీసుకుందన్నారు.

మరిన్ని వార్తలు