భారీగా ఎల్‌ఈడీ లైట్ల కుంభకోణం.. !

4 Oct, 2016 08:59 IST|Sakshi
బ్లాక్‌ లిస్టులో పెట్టమని పరిశ్రమల శాఖకు కలెక్టర్‌ రాసిన సిపార్సు లేఖ
► రెండేళ్లగా కొనసాగుతున్న ఎల్‌ఈడీ లైట్ల దోపిడీ
► జెడ్పీ సీఈఓ విచారణలో నిగ్గుతేలిన అక్రమాలు
► లైట్ల సరఫరాలో మోసాలపై లోకాయుక్తకు ఫిర్యాదు 
► ఐలైట్, అనుబంధ సంస్థలను బ్లాక్‌ లిస్టులో పెట్టాలంటూ గత కలెక్టర్‌ సిఫార్సు  
► అయినా రాజకీయ ప్రమేయంతో ఆ సంస్థపై అవ్యాజమైన ప్రేమ
► ఆ సంస్థను ఆదుకుంటున్న ఓ కేంద్రమంత్రి ఓఎస్డీ, మరో అధికారి వత్తాసు 
 
సాక్షి ప్రతినిధి, విజయనగరం :  2014 ద్వితీయార్ధంలో ఓ ఎల్‌ఈడీ లైట్‌ విలువ రూ. 7,250లు... 2015 ద్వితీయార్ధంలో రూ. 2,291లు... 2016 ప్రధమార్ధంలో రూ. 1386లు. ఇదేంటిలా తగ్గిపోయిందనుకుంటున్నారా? నిజంగా ఆ కంపెనీ ధరలేమీ తగ్గలేదు. ఇక్కడ సరఫరా చేసిన ఓ సంస్థ అలా నమ్మించి నిధులు గుంజేసిందంతే. అధికారులు కూడా ఈ విషయాన్ని ‘లైట్‌’గా తీసుకున్నారు. ఇలా సరఫరా చేసిన సంస్థకూ... దానినే సరఫరాకు ఎంపిక చేయమని సిఫారసు చేసిన నేతలకు... వాటిని అమలు చేసిన అధికారులకూ... ఇలా తలా కొంత లాభం చేకూర్చింది. అంటే సర్కారు సొమ్ము ఎంతలా కాజేశారన్నదానికి  ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే!

జిల్లాలో ఎల్‌ఈడీ లైట్ల సరఫరాలో పెద్ద స్కామ్‌ నడుస్తోంది. ఇందులో ఓ కేంద్రమంత్రి ఓఎస్డీ ప్రమేయం, మరో జిల్లా అధికారి జోక్యం ఉండటంతో ఐలైట్‌ సంస్థకు కలిసొచ్చింది. ఈ సంస్థ నిర్వాకంపై ఇప్పటికే జిల్లా పరిషత్‌ సీఈఓ గనియా రాజకుమారి విచారణ చేపట్టారు. గంట్యాడ, జామి మండలాల్లో చేపట్టిన విచారణలో గంట్యాడ మండలానికి సంబంధించిన అక్రమాల నిగ్గు తేలింది. రికార్డుపరంగా అధికారులదే తప్పు కావడంతో ఎంపీడీఓను సస్పెండ్‌ చేశారు. అంతేకాదు... రూ. 11,10,816ల రికవరీకి ఆదేశించారు. ఈ వ్యవహారం లోకాయుక్తవరకు వెళ్లింది. ఎక్కువ రేటు, నాసిరకం లైట్ల దష్ట్యా ఐలైట్‌ సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని సాక్షాత్తూ గత కలెక్టర్‌ ఎం.ఎం.నాయక్‌ ఆదేశించారు. అయినా... మళ్లీ మళ్లీ ఐలైట్‌ సంస్థకే కాంట్రాక్ట్‌ కట్టబెడుతున్నారు. ఎంతలా అంటే... టెండర్లలో ఎక్కువ కోట్‌ చేసినప్పటికీ తక్కువ కోట్‌ చేసిన సంస్థలో వాటా కల్పించారు.
 
అసలేం జరిగిందంటే...
2014లో రాజ్యసభ సభ్యురాలు రత్నాబాయి జిల్లాలోని గంట్యాడ, జామి మండలాలకు ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించారు. గంట్యాడ మండలంలోని 14పంచాయతీలకు 224 లైట్లు, జామి మండలంలోని ఐదు పంచాయతీలకు 125లైట్లు ఏర్పాటు చేసేందుకు ఎంపీ ల్యాడ్స్‌ సమకూర్చారు. 20వాట్స్‌ లైట్‌ను గంట్యాడ మండలంలో ఒక్కొక్కటీ రూ. 7,250లచొప్పున, జామిలో ఒక్కొక్క లైట్‌ను రూ. 6వేలకు ఐలైట్‌ సంస్థ, దాని అనుబంధ సంస్థ నుంచి కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. ఐలైట్‌ సంస్థ, దాని అనుబంధ సంస్థల నుంచి కొటేషన్‌ తీసుకుని, అందులో తక్కువ కోట్‌ చేసిన దాన్ని ఖరారు చేశారు. వాస్తవానికి అంతకన్న ఎక్కువ వాట్స్‌(24వాట్స్‌) గల లైట్‌ రూ. 1950కే దొరుకుతోంది. ఆ రేటుకు ఐలైట్‌ సంస్థకు చెందిన వీసీఆర్‌ సంస్థ ఓ ఓల్టేజ్‌ హోంకు విక్రయించినట్టు బిల్లుకూడా ఉంది. అంటే బహిరంగ మార్కెట్‌ రేటుకు, అధికారులు ఖరారు చేసిన కాంట్రాక్ట్‌ రేటుకు వ్యత్యాసం వేలల్లో ఉండటం ఒక ఎత్తయితే... పంచాయతీల్లో ఏర్పాటు చేసిన వెంటనే అవికాస్తా పాడవ్వడం మరో ఎత్తు. దీనిపై గంట్యాడ మండలం బుడతనాపల్లి సర్పంచ్‌ బుద్ధరాజు రాంబాబు లోకాయుక్తను ఆశ్రయించారు. దీనిపై జిల్లా పరిషత్‌ సీఈఓ రాజకుమారిని విచారణాధికారిగా నియమించారు.
 
వాస్తవాలు బట్టబయలు
జెడ్పీ సీఈఓ నిర్వహించిన విచారణలో ఎంపీల్యాడ్స్‌ నిధులతో గంట్యాడ మండలంలోని 14గ్రామ పంచాయతీలకు ఎల్‌ఈడీ లైట్లు అధిక రేట్లకు కొనుగోలు చేసినట్టు, అవీ బ్రాండెడ్‌వి కావని తేలింది. ఒప్పందం ప్రకారం లైట్లు సరఫరా చేశారా లేదా అని కూడా చూడకుండా క్లియరెన్స్‌ ఇచ్చేశారు. విచారణ సమయానికి సరఫరా చేసిన 224లైట్లలో 142మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా 66 మూలకు చేరాయి. డి.కె.పర్తి పంచాయతీలో 19లైట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఒక్కటీ అమర్చలేదు. దీనికంతటికీ సంజాయిషీ ఇవ్వాలని అప్పటి ఎంపీడీఓకు విచారణాధికారి, జిల్లా పరిషత్‌ సీఈఓ జి.రాజకుమారి నోటీసు జారీ చేశారు.
 
ఎంపీడీఓ సస్పెన్షన్‌... ఆ పై రికవరీ నోటీసు
గంట్యాడ మండలం ఎస్సీ, ఎస్టీ కాలనీలో ఎల్‌ఈడీ లైట్లను మార్కెట్‌ రేటు కంటే అధికంగా కొనుగోలు చేసి నిధులు దుర్వినియోగం చేశారని తేల్చారు. 20వాట్స్‌ సామర్థ్యం గల ఎల్‌ఈడీ లైటును ఒక్కొక్కటి రూ. 7,250చొప్పున 224 లైట్లు కొనుగోలు చేయడం ద్వారా రూ. 11,10,816లు దుర్వినియోగమైనట్టు గుర్తించి దానిని రికవరీ చేయాల్సిందిగా అప్పటి కలెక్టర్‌ ఎం.ఎం.నాయక్‌ ఆదేశించారు. నిధుల దుర్వినియోగానికి ఎంపీడీఓయే బాధ్యుడిగా నిర్ధారించి, ఆయన్ను సస్పెండ్‌ చేశారు. అంతేగాదు.. బుడతనాపల్లి సర్పంచ్‌ బుద్ధరాజు రాంబాబు లైట్లకు అధిక రేటు తీసుకోవడమే గాకుండా... నాసిరకంవి సరఫరా చేశారని లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తూ ఆ సంస్థను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ఎం.ఎం.నాయక్‌ జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌ను ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. 
 
ఫిలిప్స్, శ్యామ్‌సంగ్‌ ముసుగులో
2014–2015లో ఫిలిప్స్, క్రీ, నిచియా, ఓసోరామ్, శ్యామ్‌సంగ్‌ కంపెనీలకు చెందిన 20వాట్స్‌ సామర్థ్యం గల లైట్‌ ధరను రూ. 7,199గా చీఫ్‌ ఇంజినీర్ల కమిటీ నిర్దేశించింది. ఈ ఎస్‌ఎస్‌(స్టాండర్డ్‌ షెడ్యూల్‌)రేటు ఆధారంగా స్థానికంగా ఉన్న ఐలైట్‌ సంస్థ నుంచి లైట్లను కొనుగోలు చేశారు. ఎస్‌ఎస్‌ఆర్‌ కంటే ఎక్కువ వేసి రూ. 7,250కొనుగోలు చేసి, ఆ సంస్థపై తమకున్న ప్రేమను చూపించారు. దీనికంతటికీ ఓ కేంద్రమంత్రి ఓఎస్డీ, మరో అధికారే కారణమని తెలుస్తోంది. 
 
ఎందుకో అంత ప్రేమ?
ఆ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టమని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినా... మళ్లీ మళ్లీ అదే సంస్థకు లైట్ల సరఫరా బాధ్యత అప్పగిస్తున్నారు. గత ఏడాది రూ. 2,291లకు ఆ సంస్థనుంచి లైట్లు కొనుగోలు చేశారు. అంతేకాదు. ఈ ఏడాది కూడా వేసిన టెండర్లలో ఆ సంస్థ రూ. 15వందల పైచిలుకు ధరకు సరఫరా చేస్తామని ముందుకు రాగా.. వేరే సంస్థ రూ. 1386లకే ఇస్తానంది. తక్కువ కోట్‌ చేసిన సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టాల్సి ఉండగా... అందులో సగమే వారికిచ్చి... మిగిలిన సగాన్ని ఐలైట్‌ సంస్థకే రూ. 1386ల వంతున సరఫరా చేసేందుకు కట్టబెట్టడం గమనార్హం.
 
మరిన్ని వార్తలు