నేటి నుంచి నామినేషన్లు

26 Oct, 2016 01:58 IST|Sakshi

5న తుది జాబితా
19న పోలింగ్
22న కౌంటింగ్

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల కోసం ఈనెల 26వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. తమిళనాడులో మూడు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి వచ్చేనెల 19వ తేదీ పోలింగ్ జరుగనుంది. ఈ ఏడాది మేలో జరిగిన తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాలకుగానూ 232 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరిగింది. తంజావూరు, కరూరు జిల్లా అరవకురిచ్చి స్థానాల్లో ఓటర్లను మభ్యపెట్టేలా నగదు, చీరలు, పంచెలు, మద్యం బాటిళ్లు సరఫరా జరిగినట్లు ఆరోపణలు రావడంతోపాటు పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది.
 
 దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అలాగే, మధురై జిల్లా తిరుప్పరగున్రం నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే టికెట్‌పై పోటీచేసిన శీనివేల్ గెలుపొందారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో ఆరునెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మూడు నియోజకవర్గాల్లో నవంబర్ 19వ తేదీన పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ పోటీకి దిగుతున్నా ఇంకా అభ్యర్థుల పేర్లను వెల్లడించలేదు.
 
 ఉప ఎన్నికల్లో భాగంగా ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ 26వ తేదీన ఆరంభం కానుంది. అరవకురిచ్చి నియోజకవర్గ ఎన్నికల అధికారిగా కరూరు జిల్లా సంయుక్త కలెక్టర్ సైబుద్దీన్ నియమితులుకాగా, అరవకురిచ్చి తాలూకా కార్యాలయంలో తాత్కాలిక ఎన్నికల కార్యాలయాన్ని తెరిచారు. తంజావూరు ఎన్నికల అధికారిగా ఇన్నాచ్చిముత్తు నియమితులయ్యారు. ఈ మూడు నియోజకవర్గాల్లో ఈనెల 26వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. శని, ఆదివారాల్లో సెలవు. నవంబరు 3వ తేదీ నామినేషన్ల పరిశీలన, 5వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణ, అదే రోజు ఉప ఎన్నికల రంగంలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 19వ తేదీన పోలింగ్, 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
 
పుదుచ్చేరిలో ఒక స్థానం:
కాగా, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి కోసం నెల్లితోప్పు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక జరుగుతుండగా, 26వ తేదీ నుంచే నామినేషన్లను స్వీకరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణస్వామి, అన్నాడీఎంకే అభ్యర్థిగా ఓంశక్తిశేఖర్ ప్రధాన అభ్యర్థులుగా తలపడుతున్నారు.
 

మరిన్ని వార్తలు