స్థానిక నాయకులవల్లే ‘ఈశాన్యం’ వెనుకబాటు

30 Dec, 2014 22:24 IST|Sakshi
స్థానిక నాయకులవల్లే ‘ఈశాన్యం’ వెనుకబాటు

సాక్షి, ముంబై : ఈశాన్య రాష్ట్రాల వెనుకబాటుతనానికి దేశ రాజధాని న్యూఢిల్లీ కాదని, స్థానిక నాయకుల వైఫల్యమే కారణమని కే్రంద హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజ్యుజీ అన్నారు. దాదర్‌లోని వీర్‌సావర్కర్ స్మృతిపథ్ సభాగృహంలో సోమవారం రాత్రి ‘మైహోం ఇండియా’ సామాజిక సంస్థ నిర్వహించిన ‘అవర్ నార్త్ ఈస్ట్ (వన్) ఇండియా అవార్డ్ ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరెన్ మాట్లాడుతూ..స్థానిక నాయకుల ఉదాసీనత కారణంగానే ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాలను భారత దేశం నుంచి విడిగా చూడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.

అయితే తమ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందనీ, ఇటీవల ఈశాన్య రాష్ట్రాలలో రైల్వే ప్రాజెక్టు ప్రారంభించడమే ఇందుకు తార్కాణమని చెప్పారు. ఈశాన్య భారతంలో అద్భుతమైన సహజ వనరులున్నాయనీ వాటిని క్రమపద్ధతిలో సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన ప్రగతిని సాధించ వచ్చని కిరెన్ పేర్కొన్నారు. కాగా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం ఇచ్చే వన్ ఇండియా అవార్డ్- 2014కు గాను ‘శిలాంగ్ టైమ్స్’ ఆంగ్ల దిన పత్రిక సంపాదకురాలు ప్యాట్రీషియా ముఖీంకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహిత మాట్లాడుతూ.. నిజానికి 95 శాతం భారతదేశం సరిహద్దు ఈశాన్య ప్రాంతంలోనే ఉందని చెప్పారు.

ఈ కారణంగా భారత ప్రభుత్వం ఈశాన్య భారతంలో మరింత మౌలిక అభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని సూచించారు. మై హోం ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు సునీల్ దేవ్‌ధర్ మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన కలంతో పోరాడిన ప్యాట్రీషియ ముఖీంకు వన్ ఇండియా అవార్డును ప్రదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి నగర బీజేపీ అధ్యక్షుడు ఆశీష్ శేలార్, వివిధ రంగాలకు చెందిన ఇతర ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు.

>
మరిన్ని వార్తలు