ఆత్మాభిమానం లేని పార్టీ

12 Jul, 2015 08:47 IST|Sakshi
ఆత్మాభిమానం లేని పార్టీ

శివసేనపై ఎన్సీపీ అధినేత  శరద్ పవార్ తీవ్ర విమర్శలు
♦ బాల్ ఠాక్రే హయాంలోని సేన, ప్రస్తుత సేనకు పొంతనే లేదు
♦ షా వ్యాఖ్యలపై స్పందించలేని స్థితిలో ఆ పార్టీ
♦ ఆత్మాభిమానం ఉంటే మద్దతు ఉపసంహరించుకోవాలని వ్యాఖ్య
♦ ప్రభుత్వానికి అదే ఆఖరిరోజు: అజిత్ పవార్
 
 సాక్షి, ముంబై : బాలా సాహేబ్ ఉన్న సమయంలో శివసేనకు ఆత్మగౌరవం ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో శివసేనను ప్రభుత్వంలోకి  తీసుకోవాల్సి వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగంగా విచారం వ్యక్తం చేస్తున్నప్పటికీ సేనలో ఎలాంటి హావభావాలు కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. సేన మారిపోయిందని, బాల్ ఠాక్రే హయాంలోని సేనకూ ప్రస్తుత సేనకూ చాలా మార్పు ఉందని విమర్శించారు.

కొంకణ్ పర్యటనలో ఉన్న పవార్ సింధుదుర్గ్‌లో విలేకరులతో మాట్లాడుతూ..  సేనకు ఆత్మాభిమానం ఉన్నట్లయితే.. లేదా ఉన్నట్లు గుర్తొస్తే సేన బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంటుందని, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. పవార్ వ్యాఖ్యలపై సేన నేత ఒకరు మాట్లాడుతూ.. ఆత్మ గౌరవం గురించి సేనకు పవార్ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. విదేశీ మూలాలున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో విభేదించిన పవార్ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిశారని గుర్తు చేశారు.

 పుణేలో అల్లర్లకు ప్రభుత్వ వైఫల్యమే కారణం : అజిత్ పవార్
 ఓ వైపు శరద్ పవార్ సేనకు ఆత్మాభిమానం లేదని విమర్శిస్తుంటే మరోవైపు అజిత్ పవార్ తనదైన శైలిలో సేనపై విరుచుకుపడ్డారు. బీజేపీకి సేన మద్దతు ఉపసంహరించుకున్న రోజే ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఆఖరి రోజవుతుందని ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ పేర్కొన్నారు. శాంతికి నిలయమైన పుణే నగరంలో అల్లర్లు జరుగుతున్నాయని, దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. వర్షకాల సమావేశంలో పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు.

 స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి
 జాతీయ సమస్యలను పక్కనబెట్టి స్థానిక పౌర సమస్యలపై దృష్టి సారించాలని శివసేనకు బీజేపీ హితవు పలికింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య భేటీ దురదృష్టకరమని శివసేన వ్యాఖ్యానించడంపై  ముంబై బీజేపీ నేత అశిష్ షేలర్  స్పందిస్తూ.. మోదీ, నవాజ్ షరీఫ్‌తో ఎందుకు భేటీ అయ్యారో తెలుసుకోవాలని సూచించారు. జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలపై చర్చించేందుకు ఆయన భేటీ అయ్యారని తెలిపారు. 26/11 ముంబై దాడుల కేసు పాకిస్తాన్‌లోని ఓ కోర్టులో విచారణ జరుగుతోందని, త్వరితగతిన కేసును పూర్తి చేయాలని మోదీ పాకిస్తాన్‌ని కోరారని చెప్పారు.

దేశానికి చెందిన జాలర్లు కొంతమంది పాకిస్తాన్ జైళ్లల్లో ఉన్నారని, వారి విడుదలపై కూడా సమావేశంలో చర్చించారని షేలర్ పేర్కొన్నారు. భారత్-పాకిస్తాన్ సంబంధాలు ఎలా ఉన్నాయో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌తో మోదీ భేటీ దురదృష్టకరమని, సరిహద్దుల్లో పరిస్థితి ఇంకా మారలేదని, దీనిపై పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పాలని  శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

 ముంబై డ్రైనేజీ గురించి మాట్లాడరేం..
 కాగా, సేనపై షేలర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల  ఇటీవల ముంబైలో వరదలు వచ్చాయని, జాతీయ సమస్యలను ఇంతగా పట్టించుకుంటున్న సేన.. ముంబైలో డ్రైనేజీ వ్యవస్థను సరిగా పట్టించుకోని, శుభ్రం చేయించని ఎంసీజీఎం కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ముంబైలో ఉధృతమవుతున్న మెదడువాపు కేసుల విషయంలో కూడా సేన దృష్టిపెట్టాలని చెప్పారు.

మరిన్ని వార్తలు