45 నిమిషాల్లో డ్రైవింగ్ లెసైన్స్

3 Oct, 2013 00:24 IST|Sakshi

సాక్షి, ముంబై: కేవలం 45 నిమిషాల్లోనే డ్రైవింగ్ లెసైన్సుల జారీ ! ఇదేదో విదేశాల్లో ఉన్న సదుపాయం కాదు. వడాలా ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) ఇక నుంచి 45 నిమిషాల్లోనే లెసైన్సులు ఇవ్వనుంది. అయితే అంధేరీ ఆర్టీఓ గత రెండు నెలల్లోనే డ్రైవింగ్ నేర్చుకున్న 12 వేల మందికి లెసైన్సులను జారీ చేసింది రికార్డు సృష్టించింది.  కేవలం 15 నిమిషాల వ్యధిలోనూ లెసైన్సులను జారీ చేసిన ఘనత దక్కించుకుంది.

దీనిబాటలోనే వడాలా ఆర్టీఓలోనూ మరికొన్ని రోజుల్లో ఇదే విధానాన్ని అనుసరించనుంది. ఇక నుంచి డ్రైవింగ్ లెసైన్స్ పొందాలనుకునేవారు తమ వివరాలను తనిఖీ చేయించుకునేందుకు ఒక శాఖ నుంచి మరో శాఖకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఫారాలు నింపడం, ఇతర రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అమల్లో ఉన్న ఈ సుదీర్ఘ ప్రక్రియల కారణంగా డ్రైవింగ్ లెసైన్సులను జారీకి అధికం సమయం పడుతోంది. కొత్త ప్రక్రియను ప్రారంభించిన తర్వాత డ్రైవింగ్ లెసైన్సును అదేరోజు కేవలం 45 నిమిషాల్లోనే పొందవచ్చని ఆర్టీఓ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఆర్టీఓ అధికారులు గత నాలుగు నెలలుగా కృషి చేస్తున్నారని అధికారి తెలిపారు.
 
 ఈ కొత్త విధానంలో లెసైన్సులు పొందడం చాలా సులువుగా ఉంటుందన్నారు. లెసైన్స్ పొందదలచిన వ్యక్తి దరఖాస్తు కోసం రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత అతని పేరు, చిరునామా తదితర వివరాలు కంప్యూటర్‌లో పొందుపరుస్తారు. ఈ సమాచారాన్ని, ఒరిజినల్ పత్రాలను మరో అధికారి తనిఖీ చేస్తారు. తదనంతరం దరఖాస్తుదారుడి నుంచి బయోమెట్రిక్ వేలిముద్రలను సేకరిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థి ఫోటోను కూడా తీస్తారు. అంతేగాకుండా రహదారిని గుర్తించే చిహ్నాలు, సిగ్నల్స్‌కు సంబంధించిన పరీక్షలను కార్యాలయంలోనే నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు కేవలం 45 నిమిషాల వ్యవధి మాత్రమే పడుతుందని అధికారి తెలిపారు.
 

లెసైన్సులను త్వరగా జారీ చేయడానికి కార్యాలయంలోని ఓ హాలును అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. వడాలా ఆర్టీఓలో మున్ముందు అభ్యర్థులకు కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించే సదుపాయం కల్పించనున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ వి.ఎన్.మోరే తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలను ప్రింటర్‌తో అనుసంధానం చేస్తారు. దీంతో లెసైన్సులను జారీ చేసే సమయం మరింత తగ్గనుంది. రాష్ట్రంలోని మిగతా ఆర్టీఓలో కార్యాలయాల్లోనూ డ్రైవింగ్ లెసైన్సుల జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు