ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రవాసాంధ్రుల నిరసన

31 Jul, 2013 04:49 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడగొట్టడానికి యూపీఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలపడంపై ఇక్కడి ప్రవాసాంధ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో తెలంగాణ వాసుల ఆకాంక్షలు కాకుండా లబ్ధి కోసం కాంగ్రెస్ సాగించిన వికృత రాజకీయ క్రీడ బహిర్గతమైందని కన్నెర్ర చేశారు. వచ్చే లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో ఏ విధంగా విజయాన్ని సొంతం చేసుకోవాలనే యావ తప్ప, ఆంధ్రప్రదేశ్ విస్తృత ప్రయోజనాలను కాంగ్రెస్ ఏమాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో నదీ జలాల వివాదం వల్ల ఇప్పటికే తల బొప్పి కడుతున్న తరుణంలో, కొత్త రాష్ట్రం ఏర్పాటు ద్వారా ఆ సమస్యను మరింత జటిలం చేసిందని ఆక్రోశించారు.
 
 తెలంగాణ ఏర్పాటు వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుందనే ఆందోళనను కాంగ్రెస్ పట్టించుకోలేదని ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్న ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల్లోని సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలపై కూడా ప్రవాసాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి క్షణం వరకు అధికారాన్ని అంటి పెట్టుకుని ఉండాలనే ధ్యాస తప్ప సమైక్య రాష్ర్టం గురించి వారు ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. సీమాంధ్రలోని ఈ రెండు పార్టీల  ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉంటే కేంద్రంలోని యూపీఏ సర్కారుకు దడ పుట్టి, ఇటువంటి తీవ్ర నిర్ణయానికి ఒడిగట్టక పోయి ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
 అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలి    
 ‘కేంద్ర ప్రభుత్వం ప్రజాభీష్టానికి అనుగుణంగా వ్యవహరించాలి.  ఎన్నో ఏళ్లుగా నానుతున్న సమస్యకు పరిష్కారం లభిం చిందని సంతోషించాలో లేక విడిపోతున్నామని ఆవేదన చెందాలో... అర్థం కావడం లేదు. పార్లమెంట్‌లో చర్చ జరిగే సందర్భంలో ప్రతి ఎంపీ అభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.’- రాధాకృష్ణ రాజు, ప్రవాసాంధ్రుడు, బెంగళూరు
 
 విభజించడం అన్యాయం
 ‘భాషా ప్రయుక్త రాష్ట్రల కోసం తొలి అడుగు వేసింది తెలుగు వారే. తెలుగు భాషా రాష్ట్రాన్ని నేడు రెండుగా విభజించి కాంగ్రెస్ పార్టీ ఘోర తప్పిదానికి పాల్పడింది. తెలుగు రాష్ట్రాలు రెండు కావడంతో రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారికి తీవ్ర అన్యాయం జరుగుతుంది.       - రామస్వామిరెడ్డి యూసీపీఐ జిల్లా కార్యదర్శి, క్రిష్ణగిరి(తమిళనాడు)
 
 స్వార్థ రాజకీయాల కోసమే విభజన  
  ‘అన్నదమ్ముల్లా జీవిస్తున్న తెలుగువారిని విడదీసి కాంగ్రెస్ పార్టీ ఏమి సాధించాలనుకుంటుందో అర్థం కావడం లేదు. ఒక్క భాష మాట్లాడే వారిని ఎన్ని రాష్ట్రాలుగా విభజిస్తారు? ఆంధ్రప్రదేశ్‌ను విభజించి రెండు ప్రాంతాలలో చిచ్చు పెట్టారు.  
     - కోటే వెంకటేశ్.  చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బెంగళూరు
 
 వైఎస్ ఆశయానికి తూట్లు
 ‘ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడానికి మొక్కవోని దీక్షను ప్రదర్శించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి ఫొటోను పెట్టుకుని గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి.  ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరుతూ కర్ణాటక గవర్నర్‌కు గత జనవరి 26న మెమొరాండం ఇచ్చాం. విభజనను జీర్ణం చేసుకోలేక పోతున్నాం.            

- భక్తవత్సల రెడ్డి, ప్రవాసాంధ్రుడు, బెంగళూరు

>
మరిన్ని వార్తలు