విలీనం ఎండమావే!

3 May, 2017 02:27 IST|Sakshi
విలీనం ఎండమావే!

► కత్తులు దూసుకుంటున్న వైరివర్గాలు
► పన్నీర్‌ అవినీతి చిట్టాకు సీఎం ఆదేశం
►  మంత్రుల  తిట్ల దండకాలు


అన్నాడీఎంకే వైరివర్గాల విలీనం ఎండమావేనని మరోసారి తేలిపోయింది. ‘కలిసిపోదాం..రా’ అంటూ కడుపులో కత్తులు పెట్టుకుని ఎడపాడి, పన్నీర్‌ వర్గాలు కౌగిలించుకునే ప్రయత్నాలు బహిర్గతమయ్యాయి. పన్నీర్‌ అవినీతి చిట్టా తయారీకి సీఎం సిద్ధం అవుతుండగా, ఎడపాడిని ఎండగట్టేందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు పన్నీర్‌ సమాయత్తం అవుతున్నారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎంజీఆర్‌ మరణం తరువాత అన్నాడీఎంకే కోడిపుంజు, రెండాకులుగా విడిపోగా, జయ మరణం తరువాత టోపీ, రెండు దీపాల విద్యుత్‌ స్తంభాలుగా చీలిపోయింది. ఎన్నికల కమిషన్‌ చేతిలో చిక్కుకున్న పార్టీ, రెండాకుల చిహ్నం దక్కించుకునేందుకు గత్యంతరం లేక ఇరువర్గాలు ఇటీవల ఐక్యతారాగం ఆలపించడం ప్రారంభించాయి. అయితే ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి శశికళ, దినకరన్‌లను శాశ్వతంగా తప్పించాలన్న పన్నీర్‌సెల్వం డిమాండ్‌తో విలీనానికి విఘాతం ఏర్పడింది. అయినా, వైరి వర్గాలు ఏకం కావడంపై ఇంకా ఆశలు రేకెత్తిస్తూ శశికళ, దినకరన్‌ల బహిష్కరణకు మార్గాలను సూచించాల్సిందిగా లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై మంగళవారం పన్నీర్‌వర్గాలను కోరడం విచిత్రం.

అలాగే ఎడపాడి అసంతృప్త ఎమ్మెల్యేలు కరూరులో ఈనెల 5వ తేదీన నిరాహారదీక్షకు సిద్ధం కావడం, విలీన ప్రయత్నాలు విఫలం కావడంతో పన్నీర్‌ వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు ఎడపాడి వైపు చూడడం అన్నాడీఎంకే చోటుచేసుకుంటున్న విచిత్రపరిణామాలు. ఆనాడు ఇరువర్గాలు అనతికాలంలోనే ఏకమైపోగా ఈసారి మాత్రం ఎడపాడి, పన్నీర్‌ సెల్వం వర్గాల ఏకం ఎండమావిని తలపిస్తోంది.

నిబంధనలను లేని చర్చలకు సిద్ధమని సీఎం ఎడపాడి పునరుద్ఘాటించగా, ఏకం కావడంపై ఎడపాడి కపటనాటకం ఆడుతున్నారని పన్నీర్‌ సెల్వం మేడే నాటి సభల్లో దుయ్యబట్టారు. సీఎం కోవలోనే మంత్రులు సెంగొట్టయ్యన్, దిండుగల్లు శ్రీనివాసన్, ఆర్‌ వైద్యలింగం, పార్టీ అధికార ప్రతినిధి నాంజిల్‌ సంపత్‌, మాజీ మంత్రి వలర్మతి మంగళవారం వేర్వేరు ప్రకటనల ద్వారా పన్నీర్‌సెల్వంపై తిట్టదండకం అందుకుని ఇరువర్గాలు ఏకం కావడం ఇక ఎండమావేననే సంకేతాలు ఇచ్చారు.

పన్నీర్‌ అవినీతి చిట్టాకు సీఎం ఆదేశం: ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి హోదాల్లో ఆరేళ్ల కాలంలో పన్నీర్‌సెల్వం అవకతవకలపై శాఖలవారీగా జాబితాను సిద్ధం చేయాల్సిందిగా సీఎం ఎడపాడి మంగళవారం ఆదేశించారు. 122 మంది ఎమ్మెల్యేలు, 29 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు 50 మంది పార్టీ జిల్లా కార్యదర్శులు లెక్కన 90 శాతం పార్టీ తమ పక్షాన ఉందని కొన్ని రోజుల క్రితం సేలంలో మీడియాతో సీఎం వ్యాఖ్యానించారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ఇరువర్గాల ఏకమయ్యే ప్రశ్నేలేదని తేటతెల్లం చేశాయి. ఇదిలా ఉండగా ఆర్కేనగర్‌లో మేడే నాడు పన్నీర్‌సెల్వం సైతం...చర్చల పేరుతో ఎడపాడి వర్గం కపట నాటకం ఆడుతోందని విమర్శించారు. ఒక కుటుంబ కబంధ హస్తం నుంచి పార్టీకి విముక్తి కల్పిస్తానని కూడా ప్రజలకు హామీ ఇచ్చారు.

దినకరన్‌ ముఠాకు చెందిన వ్యక్తి ఎడపాడి అంటూ ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ కేసులో అరెస్టయిన దినకరన్‌తో ముడిపెట్టడం ద్వారా ఎడపాడిని సైతం అరెస్ట్‌ చేయించాలని పన్నీర్‌సెల్వం పన్నాగంగా అనుమానించారు. పన్నీర్‌సెల్వం ఈనెల 5వ తేదీ నుంచి నిర్వహించే రాష్ట్ర పర్యటనలో తనపై ఆరోపణలు చేయడం ఖాయమని విశ్వసించిన సీఎం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రిగా ఆరేళ్ల కాలంలో పన్నీర్‌సెల్వం అవినీతి చిట్టాను సిద్ధం చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. అంతేగాక క్వారీల కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డితో కుమ్మక్కు తదితర అంశాలను తోడుతున్నారు. అంటే సీఎం ఎడపాడి, మాజీ సీఎం ఎడపాడి నేరుగా ఢీకొనేందుకు సిద్ధంద్దం అవుతున్నట్లు భావించవచ్చు.

మరిన్ని వార్తలు