నిబంధనలు ఉల్లంఘించి ఫొటోలు, వీడియోలు

17 Dec, 2019 08:21 IST|Sakshi

నిషేధిత ప్రాంతంలో ఫొటోషూట్, వీడియో రికార్డింగ్‌

సోషల్‌ మీడియాలో విస్తృత ప్రసారం

భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నవ కిషోర్‌ దాస్‌ కుమార్తె హద్దు మీరి హీరాకుడ్‌ జలాశయం నిషేధిత ప్రాంతంలో ఫొటో, వీడియోలు తీసుకోవడం దుమారం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రసారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంత్రి కుమార్తెతో పాటు మరో ముగ్గురు యువతులు ఈ వీడియోలో ఉన్నారు. వీరంతా సినిమా, ఆల్బమ్‌లలో నటిస్తుంటారు. హీరాకుడ్‌ జలాశయం నిషేధిత ప్రాంతంలో వీరంతా ఫొటోలు తీసుకుని వీడియో రికార్డింగ్‌ చేశారు. కాగా విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది మినహా ఇతరులను అనుమతించని నిషేధిత ప్రాంతంలోకి ఈ యువతుల బృందం చేరడం ఎలా సాధ్యమైందనే విషయంపై చర్చ సాగుతోంది. వీడియో రికార్డింగు సమయంలో నిషేధిత ప్రాంతంలో కార్లు  ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తన కూతురుకి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంపై మంత్రి నవ కిషోర్‌దాస్‌ స్పందించారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారి పట్ల చట్టం తన పని తాను చేస్తుందని మంత్రి మాట దాట వేశారు.

విచారణకు సంబల్‌పూర్‌ ఎస్‌పీ ఆదేశాలు 
మంత్రి కుమార్తె దీపాలి దాస్‌తో పాటు ముగ్గురు నటీమణులు ప్రకృతి మిశ్రా, ఎలీనా సామంత్రాయ్, లోవినా నాయక్‌ ఈ ప్రసారంలో ఉన్నారు. ఆల్బమ్‌ షూటింగును పురస్కరించుకుని వీరంతా ముందస్తు అనుమతి లేకుండా హీరాకుడ్‌ జలాశయం నిషేధిత మహానది తీరానికి వెళ్లినట్లు ఆరోపణ బలం పుంజుకుంటోంది. ఈ సంఘటనపై విచారణకు సంబల్‌పూర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ కన్వర్‌ విశాల్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సబ్‌-డివిజినల్‌ పోలీసు ఆఫీసరు (ఎస్‌డీపీఓ) ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. నిషేధిత ప్రాంతంలో వీడియో చిత్రీకరణ వాస్తవమేనని నటి ఎలీనా సామంత్రాయ్‌ అంగీకరించారు. ఈ చిత్రీకరణ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వారి వివరాలు, నిషేధిత ప్రాంతంలోకి అనుమతించిన వర్గాల సమాచారం బహిరంగపరిచేందుకు ఆమె నిరాకరించారు. మంత్రి కుమార్తె చొరవతో నిషేధిత ప్రాంతంలో ప్రవేశించేందుకు అనుమతి లభించినట్లు పరోక్షంగా తెలిపారు. 


 

మరిన్ని వార్తలు