ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి

12 Jul, 2019 07:09 IST|Sakshi

జిల్లా ముఖ్య విద్యాధికారి సీఈఓ ఆదేశం

తమిళనాడు, తిరువొత్తియూరు: హెచ్‌ఐవీ బాధిత బాలుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవాలని జిల్లా ముఖ్య విద్యాధికారి గురువారం ఆదేశించారు. పెరంబలూరు జిల్లా కొలక్కానత్తంకు చెందిన ఓ బాలుడి తల్లిదండ్రులు హెచ్‌ఐవీ బాధితులు. వీరిలో బాలుడి తల్లి గతేడాది మృతి చెందింది. తండ్రి సంరక్షణలో బాలుడు ఉన్నాడు. ఈ క్రమంలో బాలుడికి హెచ్‌ఐవీ ఉన్నట్టు వైద్య పరీక్షలో తెలిసింది. ఇందుకు ఆ బాలుడు చికిత్స పొందుతున్నాడు. పెరంబలూరు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు చదివిన ఆ బాలుడు 9వ తరగతి పెరంబలూరు ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో చదివాడు. ఈ ఏడాది ఇంతకు ముందు చదివిన ప్రభుత్వ మహోన్నత పాఠశాలలోనే 10వ తరగతి చేర్చడానికి అతని బంధువులు ప్రయత్నించారు.

ఆ బాలుడికి హెచ్‌ఐవీ ఉండడంతో అతన్ని పాఠశాలలో చేర్చుకోవడానికి హెచ్‌ఎం తిరస్కరించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి బుధవారం పాఠశాల ఆవరణలో బాలుడి బంధువులకు, హెచ్‌ఎంకు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో బాలుడి బంధువులు జిల్లా కలెక్టర్‌ శాంతను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్‌ విద్యార్థిని పాఠశాలలో చేర్పించడానికి చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ బాలుడు ఏ పాఠశాలలో 10వ తరగతి చదువడానికి ఇష్టపడతాడో అదే పాఠశాలలో చేర్పించాలన్నారు. అలాగే హాస్టల్‌లో ఉంటూ చదవాలనుకుంటే పెరంబలూరు సింజేరిలో ఉన్న ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్‌లో చేర్చించాలన్నారు. ఆ బాలుడికి అడ్మిషన్‌ ఇవ్వడానికి తిరస్కరించిన పెరంబలూరు ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం(ప్రధానోపాధ్యాయుడి)పై చర్యలు తీసుకుంటామని జిల్లా ముఖ్య విద్యాఅధికారి (సీఈఓ) గురువారం ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు