కొత్త పాలనకు.. 3 రోజులే

8 Oct, 2016 15:17 IST|Sakshi
 తుది దశకు చేరుకున్న విభజన ప్రక్రియ
 ప్రభుత్వానికి పంపిన ఆర్డర్ టు సర్వ్ జాబితాలు
 ఆదేశాలందిన వెంటనే ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు
 
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. విజయదశమి నుంచే కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కావాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను నాలుగు జిల్లాలకు పంపిణీ చేసేందుకు ఆర్డర్ టు సర్వ్ జాబితాలు సిద్ధం చేసిన అధికార యంత్రాంగం ఆ జాబితాలను ప్రభుత్వానికి పంపింది. అక్కడి నుంచి ఆదేశాలందిన వెంటనే ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులను జారీ చేయాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగులను మినహాయిస్తే జిల్లాలో 62 ప్రభుత్వ శాఖల్లో సుమారు 4,297 మంది ఉద్యోగులున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలందిన వెంటనే ఈ ఉత్తర్వులు జారీ కానున్నాయి. కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించేందుకు ముహూర్తం దసరాకు గడువు మూడు రోజులే ఉండటంతో ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ ఎం.జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టరేట్ సమావేశం హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. నాలుగు చోట్ల జిల్లా కార్యాలయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి కాని శాఖలపై ప్రత్యేకంగా సమీక్షించారు.
 
ఆసిఫాబాద్‌లో కొనసాగుతున్న కార్యాలయాల వేట
కొత్తగా తెరపైకి వచ్చిన ఆసిఫాబాద్ జిల్లాలో కార్యాలయ భవనాల వేట కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ అద్వైత్‌కుమార్ ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. ఇక్కడ కార్యాలయాల ఏర్పాటుకు భవనాల కొరత ఉండటంతో అధికార యంత్రాంగానికి కొంత ఇబ్బందిగా మారింది. ఇక నిర్మల్, మంచిర్యాల్లో ఇప్పటికే జిల్లా కార్యాలయాలన్నీ సిద్ధమయ్యాయి. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల భవనాలకు రంగులు వేసి, బోర్డులను సిద్ధం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఫైళ్లు విభజన కూడా తుది దశకు చేరింది. అన్ని శాఖల్లో కలిపి సుమారు 50,481 కరెంట్ ఫైళ్లు, 73,063 క్లోజ్డ్ ఫైళ్లు ఉన్నాయి. నాలుగు జిల్లాలకు సంబందించిన ఫైళ్లన్నింటినీ ఇప్పటికే స్కానింగ్ చేసిన అధికార యంత్రాంగం వాటిని నాలుగు జిల్లాలకు పంపుతున్నారు.
 
కొత్త డివిజన్‌లు, మండలాల్లోనూ..
జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల్లో కొత్త ఆర్డీవో కార్యాలయాలు, మండల కార్యాలయాలను కూడా దసరా రోజునే ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కార్యాలయాల కోసం భవనాల గుర్తింపు చాలా మట్టుకు కొలిక్కి వచ్చింది.
 
>
మరిన్ని వార్తలు