నిస్వార్థంగా సేవలందించండి

27 Mar, 2014 04:00 IST|Sakshi
  • యువ వైద్యులకు గవర్నర్ భరద్వాజ్ సూచన
  •  వైద్య రంగంలో సేవలందించిన ఏడుగురికి గౌరవ డాక్టరేట్లు
  •  సాక్షి, బెంగళూరు : అవసరంలో ఉన్న పేదలకు నిస్వార్థంగా సేవలందించాలని యువ వైద్యులకు గవర్నర్ హంసరాజ్ భరద్వాజ్ సూచించారు. బుధవారమిక్కడి నిమ్హాన్స్ ప్రాంగణంలో నిర్వహించిన రాజీవ్‌గాంధీ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఎంబీబీఎస్, ఎంఎస్, ఎం.డి, బీడీఎస్ తదితర విభాగాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 62మందికి గోల్డ్‌మెడల్స్‌తో పాటు, వైద్య రంగంలో ఉత్తమ సేవలందిస్తున్న ఏడుగురికి గౌరవ డాక్టరేట్లను అందజేశారు. గౌరవ డాక్టరేట్లను అందుకున్న వారిలో రాజీవ్‌గాంధీ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్లు డాక్టర్ ఆర్.చంద్రశేఖర్, డాక్టర్ ఎస్.రమానంద శెట్టి, కర్ణాటక వైద్యకీయ పరిషత్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కనంజప్ప, చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ బెనకప్ప, హెల్త్‌కేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వాసుదేవ ఆర్.పాండురంగి, నారాయణ హృదయాలయ అధ్యక్షుడు డాక్టర్ దేవీప్రసాద్ శెట్టి, నేత్రధామ కంటి ఆస్పత్రి అధ్యక్షుడు డాక్టర్ శ్రీ గణేష్ ఉన్నారు. కార్యక్రమంలో కేంద్ర  వైద్య శాఖ డెరైక్టర్ డాక్టర్ విశ్వమోహన్ కటోచ్, రాజీవ్‌గాంధీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.ఎస్.శ్రీప్రకాష్ పాల్గొన్నారు.
     
    నీకెందుకు సమాధానం చెప్పాలి....
     
    స్నాతకోత్సవ సంబరాల్లో పాల్గొని వెనుదిరిగిన గవర్నర్ భరద్వాజ్ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ‘నేను నీకెందుకు సమాధానం చెప్పాలి, అసలు నువ్వు జర్నలిస్టువేనని నమ్మకం ఏంటి?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. వివరాలు పరిశీలిస్తే...మంగళూరు విశ్వవిద్యాలయానికి కొత్త వైస్ చాన్సలర్‌ను నియమించేందుకు గాను గవర్నర్  ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మైసూరు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కె.ఎస్.రంగప్పను సభ్యుడిగా నియమించారు.

    కాగా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎలా ఈ కమిటీలో సభ్యుడిగా నియమించారంటూ ఓ విలేకరి ప్రశ్నించడంతో గవర్నర్ కోపంతో ఊగిపోయారు. ‘అసలు నువ్వు జర్నలిస్టువేనా?అంటూ ప్రశ్నించారు. అవును సార్ నేను జర్నలిస్టునే, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అనగా...‘అసలు నేనెందుకు నీకు సమాధానం చెప్పాలి. నా ఇష్టం మేరకు నేను నియమించాను’ అని చెబుతూ అక్కడి నుంచి విసవిస వెళ్లిపోయారు.
     

మరిన్ని వార్తలు