ప్లీజ్... సబ్సిడీ వదులుకోండి

19 Feb, 2016 09:19 IST|Sakshi
ప్లీజ్... సబ్సిడీ వదులుకోండి

‘మీ వార్షిక ఆదాయం రూ.10లక్షలు దాటిందా, అయితే వంటగ్యాస్ సబ్సిడీని వదులుకోండి’ అంటూ ఆయిల్ కంపెనీలు వంటగ్యాస్ వినియోగదారులకు ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపుతున్నాయి.
 
చెన్నై: భారత దేశంలోని వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా సబ్సిడీని అందజేస్తోంది. సబ్సిడీపై సరఫరా అవుతున్న వంటగ్యాస్ సిలిండర్లు డీలర్ల సాక్షిగా పక్కదారి పట్టిపోయేవి. బ్లాక్‌లో అమ్ముకోవడం, గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు సరఫరా చేయడం ద్వారా డీలర్లు భారీగా అక్రమాలకు పాల్పడేవారు. అలాగే ఒకే ఇంటి యజమాని పేరున అనేక కనెక్షన్లు ఉండేవి. ఇలాంటి అక్రమాల కారణంగా వంట గ్యాస్ సబ్సిడీ మొత్తం అయిల్ కంపెనీలకు, ప్రభుత్వానికి భరించలేని భారంగా మారింది.
 
ఈ భారం నుండి తప్పించుకునేందుకు ఏడాదికి పరిమితమైన సంఖ్యలోనే సిలిండర్లను సరఫరా చేస్తామని గత యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై వినియోగదారుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తరువాత  కేంద్రంలో కొత్తగా అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్ సబ్సిడీ దుర్వినియోగంపై దృష్టి సారించింది. అక్రమ కనెక్షన్లు అరికట్టేందుకు సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. వంటగ్యాస్ సబ్సిడీని వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేసే విధానాన్ని గత ఏడాది జనవరిలో ప్రవేశపెట్టింది.
 
ప్రభుత్వానికి భారంగా పరిణమించిన వంటగ్యాస్ సబ్సిడీ నుంచి విముక్తి పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పేదలు, మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకుని మంజూరు చేస్తున్న సబ్సిడీని ధనవంతులు పొందడం సరికాదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా వినియోగదారులు తమ సబ్సిడీ నుండి స్వచ్చందంగా విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.
 
అయినప్పటికీ సబ్సిడీ నుంచి మరింతమంది వైదొలగాలని కేంద్రం ఆశిస్తోంది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలను దాటిన వినియోగదారులను వంటగ్యాస్ సబ్సిడీ నుంచి మినహాయించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం మేరకు ఆయిల్ కంపెనీలు వంటగ్యాస్ వినియోగదారులకు ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపడం ప్రారంభించాయి.
 
రూ.10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారికి వంట గ్యాస్ సబ్సిడీ సౌకర్యం లేదు, ఈ పరిధిలోకి వచ్చిన వారు తమ వివరాలను గ్యాస్ డీలర్‌కు సమర్పించి సబ్సిడీ నుంచి వైదొలగండి అంటూ ఎస్‌ఎమ్‌ఎస్‌ల ద్వారా అయిల్ కంపెనీలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
 
ఈ విషయంపై ఇండియన్ ఆయిల్ చెన్నై శాఖ జనరల్ మేనేజర్ సబితా నటరాజన్ మాట్లాడుతూ, వంటగ్యాస్ వినియోగదారులకు ముంబయిలోని తమ కేంద్ర కార్యాలయం నుండి ఈ మేరకు ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపడం బుధవారం నుంచి ప్రారంభమైందని తెలిపారు. ఈ కార్యక్రమం ముందుగానే తీసుకున్న నిర్ణయం ప్రకారం జరుగుతోందని చెప్పారు.

>
మరిన్ని వార్తలు